Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ లో మ్యాచ్ .. హైదరాబాద్ లో బెట్టింగ్ !

By:  Tupaki Desk   |   23 Jun 2021 7:00 AM GMT
పాకిస్థాన్ లో మ్యాచ్ .. హైదరాబాద్ లో బెట్టింగ్ !
X
పాకిస్థాన్ లో జరుగుతున్న సూపర్ లీగ్ మ్యాచ్ లపై హైదరాబాద్ లోని కూకట్ పల్లి, నిజాంపేట కేంద్రాలుగా జరుగుతున్న బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్, మాదాపూర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేసారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరాలు తెలియజేస్తూ..బండారీ లేఅవుట్ పావనీ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోమన్న, సత్య పవన్ కుమార్, సతీశ్ రాజు మరో ముగ్గురు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే ,నిందితుల నుంచి 22.50 లక్షలు, 33 సెల్ ఫోన్లు, బెట్టింగ్ బోర్డు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

అబుదాబిలోని షేక్‌ జయీద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ లకు నగరంలోని నిజాంపేట్‌ కేంద్రంగా ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ జరుగుతుంది. ఈ దందాకు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి సూత్రధారి కాగా.. పశ్చిమ గోదావరి వాసులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. సహాయకుల్లో కృష్ణా జిల్లా వ్యక్తి ఉన్నాడు. తూర్పుగోదావరి వాసి సోమన్నకు ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ అయిన లైవ్‌ లైన్‌ గురు, క్రికెట్‌ మజా, లోటస్, బెట్-365, బెట్‌ ఫెయిర్‌ లకు చెందిన యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయంగా వీటిని నిర్వహించే వారి నుంచి దీన్ని పొందాడని, వీటిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జి.సత్యపవన్‌ కుమార్, యూఆర్‌ సతీష్‌ రాజులకు అప్పగించాడని వివరించారు. బోర్డ్‌ నిర్వహణ కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్‌ త్రినాథ్, నూజివీడు వాసి ఎన్‌.భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన జె.ప్రసాద్‌లను ఆపరేటర్లుగా నియమించుకున్నారు.

బెట్టింగ్‌ బాక్స్‌ ద్వారా వచ్చే కాల్స్‌ ఆధారంగా ఈ ముగ్గురూ పంటర్లు కోరిన విధంగా యాప్‌లో బెట్టింగ్‌ కాస్తారు. దీని నిష్పత్తి నిమిష నిమిషానికీ మారిపోతూ ఉంటుంది. ఓడిన వారు నిష్క్రమిస్తుండగా, కొత్త వారు చేరుతూ ఉంటారు. లాభనష్టాలు పంటర్లకు యాప్‌ లో కనిపిస్తూ ఉంటాయి. పీఎస్‌ఎల్‌ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్‌ సాగుతోందని సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ నేతృత్వంలోని బృందం నిజాంపేటలోని ఫ్లాట్‌ పై దాడి చేసింది.