Begin typing your search above and press return to search.

మోడీషా సర్ ప్రైజ్.. బెంగాల్ బీజేపీ పగ్గాలు ఆమె చేతికి

By:  Tupaki Desk   |   18 May 2021 4:30 AM GMT
మోడీషా సర్ ప్రైజ్.. బెంగాల్ బీజేపీ పగ్గాలు ఆమె చేతికి
X
బెంగాల్ కోటను ఎలా అయినా సొంతం చేసుకోవాలన్న పట్టుదల మోడీషాలకు ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే.. బెంగాల్ లో తాము అనుకున్నది సాధించాలన్న మొండితనాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు మోడీషాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని భారీగా పెంచుకున్నప్పటికి.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తామన్న మాట విషయంలో ఎంతో దూరంలోనే ఆగిపోవటాన్ని మర్చిపోకూడదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల కూడా కాక ముందే.. తాజాగా మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు కమలనాథులు.

పశ్చిమబెంగాల్ లోని బీజేపీ ఇన్ ఛార్జిగా ఫైర్ బ్రాండ్ కమ్.. కేంద్రమంత్రి స్మృతిఇరానీని ఎంపిక చేస్తూ సర్ ప్రైజ్ చేసింది. మమతను ఎదుర్కోవటానికి మహిళా నేత అయితేనే బాగుంటుందన్న ఆలోచనతోనే తాజాగా స్మృతిని ఎంపిక చేసి ఉంటారని చెబుతున్నారు. గతంలోనూ గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా ఉండే అమేధీని క్రాక్ చేయటంలో ఆమె చేసిన ప్రయత్నాల్ని మర్చిపోలేం.

ఆమెకున్న టాలెంట్ ను పరిగణలోకి తీసుకొని.. దీదీని ఎదుర్కొవటం మగమగరాజుల కంటే కూడా మహిళకు అప్పజెప్పటమే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా స్మృతిని ఎంపిక చేయటం ద్వారా మమతకు సరైన రీతిలో సవాలు విసిరినట్లు చెప్పాలి. అయితే.. బెంగాలీలకు స్వాభిమానం ఎక్కువ. లోకల్ ఫీలింగ్ మరింత ఎక్కువ. అలాంటిది బెంగాల్ పార్టీ బాధ్యతల్ని ఉత్తరాదికి చెందిన మహిళా నేతకు అప్పజెప్పటంపై ఎలా రియాక్టు అవుతారన్నది ప్రశ్న. తాజా బాధ్యతను స్మృతి ఎలా నిర్వర్తిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి. మరీ ఎంపిక పై బెంగాల్ సీఎం మమత ఎలా రియాక్టు అవుతారో చూడాలి.