`సోషల్ మీడియా` కత్తికి రెండు వైపులా పదునే!

Wed Jul 18 2018 07:00:01 GMT+0530 (IST)

ప్రస్తుతం టెక్ జమానాలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పసి పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలాళ్ల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. నిద్రలేచిన తర్వాత `ఫేస్` వాష్ కూడా చేయకుండా `ఫేస్` బుక్ ఓపెన్ చేయనిదే కొందరికి రోజు ప్రారంభం కాదు. ట్విట్టర్ - యూట్యూబ్ లలో గంటల కొద్దీ సమయం గడపనిదే కొందరికి పొద్దుపోదు. ఇక కొందరికైతే తమ మిత్రులతో అర్ధరాత్రి  వరకు వాట్సాప్ లో చాటింగ్ చేయనిదే నిద్ర పట్టదు. ఈ రకంగా టెక్ జమానాలో సగటు మనిషి జీవితంతో సోషల్ మీడియా పెనవేసుకుపోయిందంటే అతిశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో... దుర్వినియోగపరచడం వల్ల అన్నే నష్టాలూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మెసేజ్ ల వల్ల ప్రాణాలు నిలబెట్టిన ఘటనలతో పాటు...ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. వాడే విధానాన్ని బట్టి సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు - అనర్థాలు రెండూ ఉన్నాయన్నది అంగీకరించాల్సిన వాస్తవం.చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయో...లేదంటే తప్పిపోయో....తమ కుటుంబానికి దూరమైన వ్యక్తులు....ఫేస్ బుక్ ద్వారా ఒక్కటైన ఘటనలు అనేకం. ఒక బాలుడు తప్పి పోయాడంటూ...వాట్సాప్ లో మెసేజ్ సర్క్యులేట్ కావడంతో....గంటల వ్వవధిలోనే ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తికి.....మరో మూల ఉన్న వ్యక్తిని అనుసంధానించే శక్తి ఉన్న మాధ్యమంగా ఫేస్ బుక్ ఉపయోగపడింది. విభిన్న వ్యక్తులతో పరిచయాలు...వారి ఆలోచనా సరళిని తెలుసుకోవడం....అభిప్రాయాలను పంచుకోవడం వంటి వాటికి సోషల్ మీడియా ఒక మంచి వేదిక. ఆరోగ్యకరమైన సమాచార వ్యాప్తి  - విజ్ఞాన ప్రదర్శనలు - ప్రతిభను చాటుకోవడం.....వంటివన్నీ సోషల్ మీడియాతోనే సాధ్యం. గతంలో టాలెంట్ ఉన్నా...సరైన ప్రచారం లేక ఎంతోమంది మరుగునపడి ఉన్నారు. కానీ సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు ఒక మంచి అవకాశం దొరికింది. సెలబ్రిటీలు - సినీతారలు - క్రీడాకారులు - దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో టచ్ లో ఉండేందుకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. వ్యక్తిగతంగా - వ్యాపారపరంగా - వృత్తిపరంగా సోషల్ మీడియా వల్ల అనేక ఉపయోగాలున్నాయి. అయితే అతి అనర్థ దాయకం అన్న తరహాలో.....మితంగా సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి.

అయితే సోషల్ మీడియాను దుర్వినియోగపరచడం వల్ల ఎన్నో అనర్థాలున్నాయి. సోషల్ మీడియాలో ఒక తప్పుడు సందేశం వైరల్ కావడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. వాట్సాప్ లో చిన్న పిల్లల కిడ్నాప్ లు....అంటూ వైరల్ అయిన మెసేజ్ వల్ల ఇప్పటికి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం - పోలీసులు - వాట్సాప్ యాజమాన్యం జోక్యం చేసుకొని...అవి తప్పుడు సందేశాలని ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు - గంటల కొద్దీ సోషల్ మీడియాలో సమయం గడపడం ఒక వ్యసనంగా మారే ప్రమాదం కూడా ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడడం వల్ల....సోషల్ బుల్లీయింగ్ కు అలవాటు పడుతున్నారని....పెద్దవారు కూడా సోషల్ మీడియాలో ఈ తరహా అనవసరపు గొడవలు వివాదాలు - చర్చలు - కామెంట్లకు బలవుతున్నారని అంటున్నారు. దాంతోపాటు సోషల్ మీడియాను ఎక్కువగా వాడడం కుటుంబ జీవితానికి దూరం కావడం....భార్యా భర్తల మధ్య విభేదాలు రావడం...వంటి ఘటనలూ ఉన్నాయి. మతపరమైన అంశాలపై విష ప్రచారం చేసేందుకు కూడా సోషల్ మీడియాను కొందరు వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అటువంటి సందేశాల వల్ల గొడవలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి మితంగా సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో....అతిగా వాడి దుర్వినియోగపరచడం వల్ల అన్ని అనర్థాలూ ఉన్నాయి. కత్తితో కూరగాయలూ తరగొచ్చు....పీకలు కోయొచ్చు...అన్ని సినిమా డైలాగ్ తరహాలో ....ఏ విధంగా సోషల్ మీడియాను వాడుతామన్నది మన చేతిలోనే ఉంది.