సంచలనం .. ఆ స్టార్ అల్ రౌండర్ క్రికెట్ కి రిటైర్మెంట్ !

Sat Jul 31 2021 13:08:34 GMT+0530 (IST)

Ben Stokes sensational decision

బెన్ స్టోక్స్ .. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. ఇంగ్లండ్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్ గెలవడానికి ఓ కారణం ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. అద్భుతమైన ఫామ్ తో ఇంగ్లాండ్ ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. కానీ టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు కేవలం సిరీస్ ప్రారంభానికి నాలుగు  రోజుల ముందే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ  స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  కొన్నాళ్లు ఆటకు విరామం పలకాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు కొన్నాళ్లు పాటు గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించాడు.వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కొన్నాళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకూడదని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎడమచేతి చూపుడు వేలుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడంపైనా దృష్టి సారించేందుకు ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని స్టోక్స్ భావిస్తున్నాడని ఈసీబీ పేర్కొంది.  ఆగస్టు 4 నుంచి భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ లో స్టోక్స్ వంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడం ఇంగ్లండ్ జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి. అయితే స్టోక్స్ స్థానాన్ని సోమర్సెట్ ఆల్ రౌండర్ క్రెగ్ ఒవర్టన్ తో భర్తీ చేయనున్నారు. ఇక ఈ సిరీస్ తో పాటు ఐపీఎల్ కూడా దూరం కానున్నాడు బెన్ స్టోక్స్.

అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ కు తెలియజేశాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందనీ చెప్పాడు. సరిగ్గా నాలుగు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో అతను చేసిన ప్రకటన ఇంగ్లాండ్ జాతీయ జట్టును ఒత్తిడిలోకి నెట్టినట్టయింది. బెన్ స్టోక్స్ కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నాడు. ప్రత్యేకించి- గత ఏడాది మొత్తం అతను ఇంటికి దూరం అయ్యాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తోన్నాడు క్రికెట్ వల్ల. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటన.. ఆ వెంటనే మళ్లీ ఐపీఎల్ 2021 అది ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్ లను ఆడాడు బెన్. పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ఇక భారత్ తో అయిదు టెస్టుల సిరీస్ ఈ బుధవారమే ట్రెంట్ బ్రిడ్జి లో ప్రారంభం కానుంది. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ సెకెండ్ ఫేస్ ఆ తరువాత టీ20 ప్రపంచకప్ ను ఆడాల్సి ఉంది.

క్రికెటర్లు ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు బయో సెక్యూర్ బబుల్ను అమలు చేస్తోన్నాయి. ఈ బయో బబుల్ వ్యవస్థ.. పరిమితంగా ఉండే ఓ కొత్త ప్రపంచం. షెడ్యూల్ను ప్రకటించిన తరువాత క్రికెటర్లందరూ అందులో వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఉన్న వారితోనే కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్ వారు బస చేసే హోటల్ సిబ్బంది.. ఇలా పరిమితంగా మాత్రమే ఉంటారందులో. చివరికి కుటుంబ సభ్యులకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. వాటన్నింటికీ మించి.. గత ఏడాది డిసెంబర్ లో ఇంటి పెద్దను కోల్పోయాడు బెన్ స్టోక్స్. అతని తండ్రి గెడ్ స్టోక్స్ 65 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్ కేన్సర్ తో సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ గత ఏడాది డిసెంబర్లో తుదిశ్వాస విడిచారు. ఇది కూడా బెన్స్టోక్స్ను మానసికంగా కుంగదీసి ఉంటుందనే వాదనలు ఉన్నాయి. తండ్రికి బ్రెయిన్ కేన్సర్ ఉందనే విషయాన్ని డాక్టర్లు ధృవీకరించిన సమయంలో కూడా బెన్ అందుబాటులో లేడు. అప్పుడతను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఆ సమాచారం తెలిసిన వెంటనే అతను అర్ధాంతరంగా పర్యటనను ముగించుకుని స్వదేశానికి వెళ్లాడు.

బెన్ స్టోక్స్ కొంత మానసిక శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడని అందువల్లే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తెలిపాడు. ఈ కష్ట సమయంలో అతనికి బోర్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చాడు. ఎన్ని రోజులైనా అతను విశ్రాంతి తీసుకోవచ్చని ఈ విషయంలో అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండబోదని హామీ ఇచ్చాడు. తాను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటే అప్పుడు జట్టులో చేరొచ్చని స్పష్టం చేశాడు. ఈ ఏడాది తొలి విడత ఐపీఎల్ సీజన్ లో బెన్ స్టోక్స్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ హండ్రెడ్ లీగ్ ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది.బెన్ స్టోక్స్ విరామం తీసుకోవడం అటు ఐపీఎల్లో అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆర్ ఆర్ జట్టును కూడా ఇబ్బందులకు గురి చేసినట్టయింది.