రౌడీ ఈవెంట్‌లో బీజేపీ నేతల హల్‌చల్!

Tue Nov 29 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Behavior style of Karnataka BJP leaders has become a hot topic now

కర్ణాటక బీజేపీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరు నగరంలో పెద్ద రౌడీషీటర్‌గా పేరున్న సైలెంట్ సునీల్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి బీజేపీలో ప్రముఖ నేతలు హాజరు కావడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడీ వ్యవహారం తీవ్ర కలకలానికి కారణమైంది. దీంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరుకునపడింది.ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని చామరాజ్ పేట్‌లో రెండు రోజుల క్రితం నగరంలో పెద్ద రౌడీషీటర్ గా పేరున్న సైలెంట్ సునీల్ ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి బీజేపీలో ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రౌడీషీటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం తీవ్ర వివాదాస్పదమైంది.

బీజేపీ ఎంపీలు పీసీ మోహన్ తేజస్వీ సూర్య చిక్ పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్నార్ రమేష్ వంటి వారు రౌడీషీటర్ సైలెంట్ సునీల్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరయ్యారు.

ఒకప్పుడు కాంట్రాక్ట్ కిల్లర్ గా సునీల్ సైలెంట్ బెంగళూరు నగరాన్ని గడగడలాడించాడు. ఇప్పుడు అతడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని చూస్తున్నాడు. అది కూడా బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి రావాలని యోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం.. దానికి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కావడం వివాదాస్పదమైంది.  రౌడీషీటర్ సైలెంట్ సునీల్ కూడా కాషాయ కండువాతో దర్శనమిచ్చాడు.

దీనిపై కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న సైలెంట్ సునీల్ వారికి దొరకడం లేదని.. బీజేపీ నేతలకు మాత్రం దొరుకుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.

బీజేపీ నేతలు కరడుగట్టిన క్రిమినల్స్ తో తిరుగుతుంటే నగరంలో క్రై మ్ రేట్ తగ్గుతుందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నగర పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న సునీల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ నేతలు వెళ్లడం ఎలాంటి సంకేతాలు ఇస్తోందని నిలదీశారు. దీనికి హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  దీంతో ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా చిక్కుల్లో పడ్డారు.

ఈ నేపథ్యంలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. వివరణ ఇవ్వాలని క్రై మ్ బ్రాంచ్‌ను ఆదేశించారు. సునీల్‌పై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని.. కాబట్టి ఈవెంట్ విషయంలో అతనిపై చర్యలు తీసుకునే పరిస్దితులు లేవని పోలీసు కమిషనర్‌కు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.