Begin typing your search above and press return to search.

కర్ణాటకలో బెడ్స్ కొరత .. విధానసభ ముందుకు.. అయన జోక్యంతో బెడ్ !

By:  Tupaki Desk   |   7 May 2021 10:30 AM GMT
కర్ణాటకలో బెడ్స్ కొరత ..  విధానసభ ముందుకు.. అయన జోక్యంతో బెడ్ !
X
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. కరోనా మహమ్మారి బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి పలు చోట్ల దర్శనం ఇస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ ఉదంతం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కరోనా బారినపడ్డ ఓ బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

అయితే, బెంగళూరులోని ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా బాధితురాలికి ఆ ఆస్పత్రిలో కూడా ఆ బాధితురాలికి బెడ్‌ దొరకలేదు. దీంతో బాధిత కుటుంబం చేసేది లేక కొవిడ్‌ బాధితుణ్ణి అంబులెన్సులో తీసుకొని విధానసభ ముందుకు చేరారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విధాన సభ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఓ కాంగ్రెస్ నాయకుడు అక్కడికి చేరుకొని వారితో పాటు నిరసనలో పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు విధానసౌధ ఎదుట ఆందోళన కొనసాగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ వెంటనే బాధితుడికి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో బెడ్‌ ఏర్పాటు చేశారు. విధానసౌధ ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న తొలి 10 రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది. అంతేకాదు, గురువారం మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా దాదాపు 50వేల పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. కర్ణాటకలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగం బెంగళూరులోనే బయటపడుతున్నాయి. దీంతో ఔషధాలు, ఆక్సిజన్ కోసం తీవ్ర కొరత ఏర్పడింది. దీనిని కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరులో పడకలను బ్లాక్‌ చేసి ఎక్కువ డబ్బు లాగుతున్నారు. కర్ణాటకలో ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య లెక్కకు అందకుండా పోతోంది.