Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఆరాచకం..ఐసోలేషన్ కేంద్రాలుగా బ్యూటీపార్లర్లు?

By:  Tupaki Desk   |   5 July 2020 5:09 AM GMT
హైదరాబాద్ లో ఆరాచకం..ఐసోలేషన్ కేంద్రాలుగా బ్యూటీపార్లర్లు?
X
కొన్ని వ్యాపార సూత్రాలు భలే సిత్రంగా ఉంటాయి. ఉప్పుకు డిమాండ్ ఉంటే ఉప్పు.. పప్పునకు డిమాండ్ వస్తే పప్పు అమ్మే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. మహమ్మారి పుణ్యా అని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుచూపు మేర కొన్ని రకాల సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాల్ని నిర్వహించలేని పరిస్థితి. ఇలాంటివేళ.. మెదడుకు మేత పెట్టిన ఒక బ్యూటీపార్లర్ యజమాని చిత్రమైన ప్లాన్ చేశారు.

అదేమంటే.. బ్యూటాపార్లర్లను ఐసోలేషన్ వార్డు కింద మార్చేశారు. రూల్స్ ను లైట్ తీసుకుంటూ ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకునేలా చేస్తున్న వైనం ఇప్పుడు విస్మయకరంగా మారింది. అలాంటి బ్యూటీపార్లర్లను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు ఐదులోని కలర్స్ బ్యూటీ పార్లర్ అని ఒకటి ఉంది.

ఇప్పుడు నడుస్తునన టైంకి బ్యూటీపార్లర్లు నడపలేని పరిస్థితి ఇలాంటివేళ.. వ్యాపారం జోరుగా మారేందుకు వీలుగా తన బ్యూటీ స్టూడియోను కాస్తా ఐసోలేషన్ వార్డు కింద మార్చేశారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న వ్యాపారం గురించి తెలుసుకున్న ఖాకీలు సైతం అవాక్కు అయ్యారట. ఎందుకంటే.. పాజిటివ్ రోగులకు రోజుకు రూ.10వేలు చొప్పున ఛార్జి చేసి చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే బ్యూటీ పార్లర్ యజమాని.. దాని సిబ్బందిని అదుపులోకి తసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. తవ్వుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు హైదరాబాద్ మహానగరంలో బోలెడన్ని కనిపిస్తాయని చెబుతున్నారు.