నగరంలో నయా దందా... ఐసోలేషన్ కేంద్రంగా బ్యూటీ పార్లర్ !

Sun Jul 05 2020 06:00:05 GMT+0530 (IST)

Beauty Parlor as Isolation Center

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా విలయతాండవం తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. దీనితో కరోనా భయంతో చాలామంది ఇంట్లో నుండి బయటకి రావడంలేదు. అయితే ఇటువంటి సమయంలో కూడా కొందరు ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో తాజాగా అలాంటి వ్యాపారం ఒకటి వెలుగులోకి వచ్చింది.అందానికి మెరుగులు దిద్దే బ్యూటీ పార్లర్ ను ఐసోలేషన్ సెంటర్ గా మార్చేశారు కొందరు మేధావులు. కరోనా వైరస్ నియమాలని ఏ మాత్రం పట్టించుకోకుండా .. నిబంధనలను తుంగలోకి తొక్కి వైరస్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్నారు.  జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని కలర్స్ బ్యూటీ పార్లర్ లో ఈ నయా దందా జరుగుతోంది.

ఈ ఐసోలేషన్ సెంటర్ నిర్వాహకులు మహమ్మారి పాజిటివ్ వ్యక్తులకు ఆశ్రయం ఇస్తూ రోజుకు రూ.10వేల ఫీజు వసూలు చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బయటపెట్టారు. ప్రస్తుతం బ్యూటీ పార్లర్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు.