‘బతుకమ్మ’ చీరల బతుకు బకెట్ల పాలు.. ఇదేంది కేసీఆర్?

Fri Oct 22 2021 18:00:02 GMT+0530 (IST)

Batukamma sarees given by the ladies for buckets

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు ఉచితంగా ఇచ్చే బతుకమ్మ చీరల దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. వందల కోట్ల రూపాయిల ప్రజాధనం చివరకు ఇలా బకెట్ల పాలు కావటం ఏమిటా? అని షాక్ తినాల్సిందే. ఒకప్పుడు బతుకమ్మ చీరల కోసం ప్రజలు భారీగా ఎగబడే వారు. కానీ.. ఇప్పుడు మాత్రం బతుకమ్మ చీరల్ని ఖాళీ ప్లాస్టిక్ టబ్బులు.. బకెట్ల కోసం ఇచ్చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. వీధి వ్యాపారులు బతుకమ్మ చీరల్ని కొంటామంటూ వీధుల్లో అరుచుకుంటూ .. వాటిని సమీకరిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.‘‘బతుకమ్మ చీరల్ని కొంటాం. కేసీఆర్ చీరలకు బకెట్లు ఇస్తాం’’ అంటూ వీధుల్లో అరుచుకుంటూ వ్యాపారుల తీరుకు ఊహించని స్పందన లభిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి సీన్ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో కనిపించినట్లుగా మీడియాలో రిపోర్టు అయ్యింది. ఒకప్పుడు బతుకమ్మ చీరలకు ఒకలాంటి క్రేజ్ ఉండేది. మొదట్లో ఈ పథకం అమలైన వేళలో చీరలు నాసిరకంగా ఉండటాన్ని తీవ్రంగా తప్పు పట్టేవారు. కొందరైతే కాల్చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేవారు. తర్వాతి కాలంలో వాటి రూపు.. నాణ్యత మారింది.

ఇప్పుడు బతుకమ్మ చీరల్ని కొంటామని అరుస్తున్న వీధి వ్యాపారులకు వాటిని మహిళలు ఇచ్చేస్తున్నారని చెబుతున్నారు. నాలుగు చీరలకు ఒక బకెట్.. ఆరు చీరలకు ఒక ప్లాస్టిక్ టబ్ ఇస్తున్నామని చెప్పటంతో.. ఇంట్లో ఉన్న బతుకమ్మ చీరల్ని ఇచ్చేసి.. వాటికి బదులుగా ప్లాస్టిక్ బకెట్లు.. టబ్బులు తీసుకోవటానికి మహిళలు ఆసక్తిని చూపించటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయటం తెలిసిందే. అక్టోబరు ఆరో తేదీ నుంచి వాటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
18 ఏళ్లకు పైబడిన రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి మహిళకు ఒక చీరను ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

ఇందుకోసం 810 రకాల చీరల్ని ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.08 కోట్ల మంది మహిళలకు చీరల్ని పంపిణీ చేసేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం రూ.333.14 కోట్లను ఖర్చు చేసింది. ఈసారి బతుకమ్మ చీరల ప్రత్యేకత ఏమంటే.. 290 రంగుల్లో తయారు చేయించారు. గత ఏడాది ఈ చీరల పంపిణీ సమయంలో మహిళల నుంచి సేకరించిన అభిప్రాయం మేరకు.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇలాంటి ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరల విషయంలో ప్రభుత్వం ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటే.. మరోవైపు వాటిని ప్లాస్టిక్ బకెట్ల కోసం ఇచ్చేయటం చూస్తే.. విలువైన ప్రజాధనం వేస్ట్ చేస్తున్న భావన కలుగక మానదు.