Begin typing your search above and press return to search.

శునకానికి బేరియాట్రిక్ సర్జరీ.. ఎంత ఖర్చు అయ్యిందంటే ?

By:  Tupaki Desk   |   19 Jun 2021 1:30 AM GMT
శునకానికి బేరియాట్రిక్ సర్జరీ.. ఎంత ఖర్చు అయ్యిందంటే ?
X
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, కుక్క అధిక బరువుతో ఉంటే, అది దాని ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తుంది. స్థూల కాయం తగ్గడానికి మనుషులకు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించడం సాధారణమే. అయితే తాజాగా శునకానికి కూడా బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. ఈ బేరియాట్రిక్ సర్జరీ ఓ శునకానికి నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారి. మహారాష్ట్రలో ఇండీ క్రాస్ బ్రీడ్ (దేశీ సంకరజాతి కుక్క) కు చెందిన ఏడేళ్ల వయసు పెంపుడు కుక్క కు విజయవంతంగా బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే .. మహారాష్ట్రలోని పూణెకి చెందిన డైసీ దారువాలా అనే మహిళ దీపిక అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. దీని వయసు 7 ఏళ్లు. ఇది రోజురోజుకు బరువు పెరిగిపోయి ఏకంగా 50 కిలోలకు చేరుకుంది. దీంతో కిడ్నీ, కార్డియాక్, లివర్, హై బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. అంతేకాదు అది నడవడానికి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీనితో ఆందోళన చెందిన యాస్మిన్ జంతు వైద్య నిపుణులను ఆశ్రయించారు. దీపికను పరీక్షించిన నిపుణులు దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించాలని సూచించారు. శునకం బరువు తగ్గి సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. కడుపులో ఉత్పత్తి అయ్యే గ్రేలిన్ హార్మోన్ అధికమైతే శరీరం పనిచేసే ప్రక్రియ మందగిస్తుంది. దీపిక ఈ సమస్య కారణంగానే బరువు పెరిగినట్లు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. బేరియాట్రిక్ సర్జరీలో ఒకటైన…లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చికిత్స ద్వారా 50 కిలోల దీపికా బరువును 5 కిలోలు తగ్గించారు. దీపిక కడుపు(జీర్ణశయం)ను 70 శాతం తొలగించినట్లు వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. స్థూల కాయులు ఎక్కువ తినకుండా జీర్ణాశయం పరిమాణం తగ్గించడమే ఈ శస్త్ర చికిత్స ప్రధాన ఉద్దేశం. ఫలితంగా దీపిక బరువు తగ్గటమే కాకుండా… అది తక్కువగా తిన్నప్పటికీ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. సర్జరీ తర్వాత దీపిక కాస్త చురుగ్గా ఉంటున్నట్లు దాని యజమాని తెలిపారు. ఈ శునకానికి రూ. 1.20 లక్షల ఖర్చుతో ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేశారు. శునకానికి ఆపరేషన్ చేసిన వైద్యులు దానిలో పేరుకుపోయి 5 కిలోల అదనపు కొవ్వును తొలగించారు. దీంతో ఆ శునకం బరువు 45 కిలోలకు చేరుకుంది.