Begin typing your search above and press return to search.

హైటెక్ సిటీలోని బార్బిక్యూ ఫ్రైడ్ కు వెళ్లిన ఆ అధికారి అనుభవం తెలుసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   26 Jun 2022 8:30 AM GMT
హైటెక్ సిటీలోని బార్బిక్యూ ఫ్రైడ్ కు వెళ్లిన ఆ అధికారి అనుభవం తెలుసుకోవాల్సిందే
X
హైటెక్ సిటీలోని బార్బిక్యూ ఫ్రైడ్.. జూబ్లీహిల్స్ అంతెరా కిచెన్ అండ్ బార్.. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మహానగరంలోని చాలా హోటళ్లు.. రెస్టారెంట్లలో నిబంధనలకు విరుద్దంగా సర్వీస్ ఛార్జి వసూలు చేస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అవసరం ఉన్నా.. లేకున్నా సర్వీసు ఛార్జితో వసూలు చేసే మొత్తాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అవగాహన ఉండి కొందరు ఈ దోపిడీని ప్రశ్నిస్తే.. మరికొందరు మాత్రం బుద్ధిగా అడిగినంత డబ్బుల్ని కట్టేసి వస్తున్నారు. అదెలా కుదురుతుందని ప్రశ్నించిన వారు.. అక్కడితో ఆగకుండా వినియోగదారుల కోర్టుకు వెళితే.. ఇలాంటి హోటళ్ల వారికి మెట్టికాయలు వేయటమే కాదు.. జరిమానాను విధిస్తున్నారు.

కొంతకాలం క్రితం రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారిణి టి. అనురాధాదేవి హైటెక్ సిటీలోని బార్బిక్యూ ఫ్రైడ్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశారు. బిల్లు రూ.1378 అయ్యింది. సర్వీస్ ఛార్జి కింద రూ.62 ఇవ్వాలని అక్కడి క్యాషియర్ చెప్పటం.. అది నిబంధనలకు విరుద్దమని చెబితే.. నో అంటే నో అంటూ ఆమె వద్ద వసూలు చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ కు వెళ్లిన ఆమెకు.. సర్వీసు ఛార్జి తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. జూబ్లీహిల్స్ లోని అంతెరా కిచెన్ అండ్ బార్ లో భోజనానికి వెళ్లిన లాయర్ రాజశేఖర్ కు రూ.3543 బిల్లు అయ్యింది. దీనిపై 5 శాతం సర్వీసు ట్యాక్స్ వేయటంతో.. దాన్ని తీసేయాలంటే కుదరదని చెప్పారు.

దీంతో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో ఆ హోటల్ యాజమాన్యానికి వసూలు చేసిన సర్వీస్ ఛార్జి తిరిగి ఇవ్వాలని.. రూ.3వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్దంగా సర్వీసు ఛార్జి వసూలు చేసే హోటళ్లు.. రెస్టారెంట్ల దోపిడీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలకు విరుద్దంగా వసూలు చేసే ఈ సర్వీసు ఛార్జి దోపిడీని ప్రశ్నించటం.. కుదరదన్న వారికి న్యాయపోరాటంతో తగిన శాస్తి జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.