Begin typing your search above and press return to search.

కరోనా మృతులను కూడా వదల్లేదు.. శవాలపై ఉన్న బంగారం మాయం !

By:  Tupaki Desk   |   7 May 2021 8:38 AM GMT
కరోనా మృతులను కూడా వదల్లేదు.. శవాలపై ఉన్న బంగారం మాయం !
X
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు అనే ప‌దాలు ఈ ఘ‌ట‌న‌కు స‌రిగా సరిపోతాయని అనుకుంటున్నారు. కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారన్న జాలి, దయ లేకుండా ఆ మృతుల బంగారు ఆభరణాలను కొట్టేస్తున్నారు. కనీస మానవత్వం లేకుండా జేబులు నింపుకున్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఎంతో మంది కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. కొందరు కరోనాతో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. అయితే ఆ మృతుల నుంచి గత కొద్ది రోజులుగా బంగారు ఆభరణాలు, వారి వద్ద డబ్బు మాయమవుతూ వస్తుంది. తిరుపతిలో చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించిన కోవిడ్ సోకిన మహిళ కుటుంబ సభ్యులు ఆమె ఆస్పత్రిలో చేరే సమయంలో ధరించిన 60 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించడం లేదు అని ఆరోపించారు.

కరోనా తో మరణించిన మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించినప్పుడు బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఆ విషయం గమనించి ఆస్పత్రి సిబ్బందిని దాని గురించి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో .. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ విచారణ లో భాగంగా ఈ ఒక్క కేసులోనే కాదు , కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చనిపోయిన రోగుల ఆభరణాల కూడా మిస్ అవుతున్నట్టు కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ హాస్పిటల్స్ జాబితాలో ప్రఖ్యాత ఆసుపత్రులు స్విమ్స్ మరియు రుయా వంటివి కూడా ఉండటం గమనార్హం. దొంగలు శవాల నుండి ఆభరణాలను దొంగిలించిన కేసులు జిల్లాలో చాలా నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సుమారు 900 మంది రోగులు కరోనాకి చికిత్స పొందుతున్నారు. అయితే , ఆసుపత్రి సిబ్బంది , ఆస్పత్రిలో జాయిన్ కావడానికి ముందుగానే వారి కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలను అప్పగించే విధానాన్ని పక్కాగా అమలు చేయడంలో విఫలం అయ్యారని అన్నారు. ఈ ఊహించని పరిణామాలతో , ఈ తరహా కేసులు పెరుగుతుండటంతో హాస్పిటల్స్ కి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ను తీసుకోని పరిశీలించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా తో ప్రాణ భయంతో ఆస్పత్రిలో చేరే రోగుల నుండి , కరోనా తో మరణించిన వారి మృతదేహాల నుండి బంగారం దొంగతనం చేస్తుండటం నిజంగా విచారకరం. గతంలో కూడా తిరుపతిలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.