Begin typing your search above and press return to search.

పెట్రోల్‌ - డీజిలే కాదు...మోదీ స‌ర్కారు ఇంకో షాక్ ఇది!

By:  Tupaki Desk   |   2 July 2020 7:10 AM GMT
పెట్రోల్‌ - డీజిలే కాదు...మోదీ స‌ర్కారు ఇంకో షాక్ ఇది!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌ర్కారు క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సామాన్యుల జేబుల‌కు చి‌ల్లులు ప‌డేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెద్ద ఎత్తున పెంచేస్తూ... కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో సామాన్యుల‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో తాజాగా ఇంకో షాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే బ్యాంకుల చార్జీల వ‌సూలు.

క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైన స‌మ‌యంలో లాక్‌డౌన్ తొలిసారిగా విధించిన‌ప్పుడు ఏటీఎం చార్జీలు, మినిమం బ్యాలెన్స్‌లకు సంబంధించి పలు రాయితీలను అప్ప‌ట్లో కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా ఎన్నిసార్లు అయినా డ‌బ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. అంతేకాదు అస‌లే డ‌బ్బులు లేకుండా ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి కాబ‌ట్టి మినిమం బ్యాలెన్స్ నిబంధ‌న‌లు కూడా ఎత్తిశారు. అయితే, ఆ గడువు ముగిసిపోవ‌డంతో.. ఇవాళ్టి నుంచి పాత పద్ధతిలో చార్జీలు ఉండ‌బోతున్నాయి. లాక్‌డౌన్ ముగిసి అన్‌లాక్ ప్రారంభం అవ‌డంతో ఈ నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తెచ్చారు.

అన్‌లాక్ 1.0 ముగిసి అన్‌లాక్ 2.0లో అడుగుపెట్ట‌డంతో బ్యాంకులు మ‌ళ్లీ ఛార్జీలు వ‌డ్డిస్తున్నాయి. ఏటీఎం చార్జీలు, మినిమం బ్యాలెన్స్‌లకు మోత మోగిస్తున్నాయి. ఒక్కో బ్యాంక్‌ ఒక్కో విధంగా ఈ చార్జీలు వేస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా కొత్త నిబంధ‌న‌లు వెల్ల‌డించింది. వాటి ప్ర‌కారం పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం నుంచి నెలకు 8 విత్‌డ్రావ‌ల్స్‌ మాత్రమే ఫ్రీగా పొందే అవ‌కాశం ఉంటుంది. వీటిలో ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఐదు, ఇతర బ్యాంకుల నుంచి మూడు న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌లు మాత్ర‌మే ఉచితంగా పొంద‌వ‌చ్చు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాటి‌ సంఖ్య 10గా ఉంది. ఇందులో ఐదు ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి, మిగ‌తా ఐదు ఇతర బ్యాంక్‌ ఏటీఎంల నుంచి చేసుకోవ‌చ్చు. ఈ ప‌రిమితి మించితే మాత్రం ఛార్జీలు వ‌డ్డింపు త‌ప్ప‌దు. ఆపై లావాదేవీల‌కు రూ.20 తోపాటు అదనంగా జీఎస్టీ వ‌సూలు చేస్తారు. క్యాష్ విత్‌డ్రా కాకుండా ఇతర సేవలైన బ్యాలెన్స్ చెక్ చేయ‌డం, పిన్ మార్చుకోవ‌డం వంటి సేవలకు అయితే రూ.8తో పాటు జీఎస్టీ కూడా వ‌సూలు చేయ‌నున్నారు.