బండ్ల కామెడీ పీస్ అయిపోయాడే..

Tue Nov 20 2018 17:06:25 GMT+0530 (IST)

Bandla Ganesh could get is the post of Official Spokesperson

నటుడు.. నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి గత రెండు నెలలుగా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బండ్ల.. ఆ పార్టీలో చేరిన తొలి రోజు నుంచి హడావుడి చేస్తూనే ఉన్నాడు. మీడియాకు తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన శైలిలో వినోదం పంచుతున్నాడు. ఆ మధ్య ఒక టీవీ ఛానెల్ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చిన వైనాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. టీఆర్ ఎస్ పార్టీ మీద.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పంచ్ డైలాగులు పేల్చుతూ మీడియాలో బాగానే నానాడు. సోషల్ మీడియాలో అతడి వీడియోలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీని మామూలుగా పైకెత్తలేదు బండ్ల. అదే సమయంలో తన గురించి కూడా బాగానే గొప్పలు పోయాడు. తన రేంజే వేరన్నాడు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం.. గెలవడం ఖాయమన్నట్లు మాట్లాడాడు.చివరికి చూస్తే అతడికి టిక్కెట్టే ఇవ్వలేదు. తొలి జాబితా... రెండో జాబితా.. మూడో జాబితా.. మార్పులు చేర్పులు అన్నీ అయిపోయాయి. చివరికి బండ్లకు మొండి చెయ్యే అని తేలిపోయింది. ఇప్పుడేమో అతడిని తెలంగాణ అధికార ప్రతినిధిగా ప్రకటిస్తూ ప్రెస్ నోట్ ఒకటి వదిలారు. దీంతో బండ్లను సోషల్ మీడియా జనాలు మామూలుగా ఆడుకోవట్లేదు. అంతన్నాడింతన్నాడే.. అంటూ బండ్లను ఏసుకుంటున్నారు నెటిజన్లు. మీడియాలో బండ్ల చేసిన హడావుడికి సంబంధించిన వీడియోలు పెట్టి అతడిని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి బండ్ల చెప్పిందానికి జరుగుతున్న దానికి పొంతన లేదు. కాంగ్రెస్ మార్కు రాజకీయంలో అతను కామెడీ పీస్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ బండ్లను ఎలా చూసింది.. పార్టీ దృష్టిలో అతనేంటన్నది కూడా జనాలకు బాగానే అర్థమైంది. ఐతే ఇంత జరిగినా బండ్ల నిరసన తెలపకుండా సైలెంటుగా ఉండటం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.