పవన్ కళ్యాణ్ తేడా జీన్స్.. బండ్ల కామెంట్స్

Mon Apr 22 2019 11:13:36 GMT+0530 (IST)

Bandla Ganesh Comments on Chiranjeevi and Pawan kalyan

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే 7ఓ క్లాక్ బ్లేడ్ తో మెడ కోసుకుంటా అని సవాల్ చేసిన నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఫలితాల తర్వాత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.  ఓ రిపోర్టర్ అయితే బ్లేడ్ తో ఆయన ఇంటి ఎదుట కాపాలా కాయడం వైరల్ అయ్యింది. అయితే ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేష్ తొలిసారి ప్రముఖ తెలుగు టీవీచానెల్ ఇంటర్వ్యూలో రాజకీయాలను వదిలేయడానికి గల కారణాలు వెల్లడించారు. ఇప్పుడు మాటలు హాట్ టాపిక్ గా మారాయి.బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావడం తొందరపాటు నిర్ణయం’ అని స్పష్టం చేశారు. రాజకీయాలపై ఆసక్తి పోయిందని.. చేయలేను అనే భయం వేయడంతోనే వదిలేశానన్నారు. రాజకీయాల్లోకి రావడం జీవితంలోనే చేసిన పెద్ద తప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఆ సమర్థత లేదని తెలుసుకొనే వైదొలిగానని చెప్పుకొచ్చారు.

రాజకీయాలువేరు స్నేహాలువేరు అంటారుకానీ.. తన రాజకీయ స్నేహితులను అలా చూడడం తన వల్ల కాలేదని బండ్ల చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉంటే అబద్ధాలు చెప్పడం.. శత్రువులను బ్లాక్ లో కొనుక్కోవడం జరిగిపోతుందని తెలిపారు. అందుకే ఈ దరిద్రాలెన్నీ తనకెందుకనే వదిలేశానని వివరణ ఇచ్చారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం అనుకున్నానని.. కానీ ప్రజలకే కాదు.. నా సేవ కూడా తాను చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు గొంతు కోసుకుంటానని అన్నానని.. ఆ పాత విషయాన్ని మళ్లీ తీయవద్దని బండ్ల విజ్ఞప్తి చేశారు. దరిద్రం నా నెత్తిన ఉండి అలా మాట్లాడించిదని వివరణ ఇచ్చారు.

ఇక పవన్ పై కూడా బండ్ల హాట్ కామెంట్ చేశారు. పవన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందన్నారు. రాహుల్ ను దేశప్రధానిగా ఉండాలని కోరుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అని ప్రశ్నించారు. ఇమ్రాన్ పాక్ ప్రధాని అయినట్టే ఇక్కడా పవన్ కావచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

సినిమాల్లో టాలెంట్ ఉంటే ఎవరైనా ఎదగవచ్చని.. కానీ రాజకీయాల్లో టాలెంట్ లేకున్నా నాయకులు రుద్దేస్తున్నారని బండ్ల ఆరోపించాడు. సినిమాలను రాజకీయాలను పోల్చడం సరికాదన్నారు. చిరు ప్రజారాజ్యం విలీనాన్ని తాను తప్పుపట్టానని..కానీ ఆయన గొప్ప వ్యక్తిత్వ విలువలు ఉన్నవారు కాబట్టే పార్టీని వీడి ఇమడలేక మళ్లీ సినిమాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు. చిరంజీవి రాజకీయాలకు దూరం కావడం 200 శాతం కరెక్ట్ అన్నారు. పవన్ మాత్రం కొనసాగాలని.. పవన్ వి తేడా జీన్స్ అని.. ఈయన రేంజీ వేరు కాబట్టి రాజకీయాలకు పవన్ సమర్ధుడని బండ్ల గణేష్ తెలిపారు.