బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Wed Nov 25 2020 23:40:12 GMT+0530 (IST)

Bandi Sanjay Sensational Comments Once Again

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంతకూ తగ్గడం లేదు. తన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. సై అంటే సై అని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొడగొడుతూనే ఉన్నాడు. దీంతో  జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది.అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది.

పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాతబస్తీలోని రోహింగ్యాలను పాకిస్తాన్ వారిని తరిమికొడతామని హెచ్చరించారు.  బండి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ఎదురుదాడికి దిగాయి.

తాజాగా మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేసేది పక్కా అని బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికలను ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చారు. మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలా.. ఇండియా గెలవాలా అని పేర్కొన్నారు. ఇండియా ఓడిపోతే నల్లాజెండాలతో నిరసన తెలిపిన వాళ్లను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు.