రచ్చ చేయటానికి తప్ప దేనికన్నా పనికొస్తుందా?

Thu Jul 07 2022 09:59:21 GMT+0530 (IST)

Bandi Sanjay About KCR Ruling

ఎనిమిదేళ్ళ కేసీయార్ పాలనకు సంబంధించి విషయాలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ దాదాపు వంద దరఖాస్తులు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా నిర్ణీత రుసుములు కట్టి మరీ బండి దరఖాస్తులు చేశారు. దరఖాస్తుల తీరుతెన్నులను గమనిస్తే ఇవన్నీ రాజకీయంగా రచ్చచేయటానికి మాత్రమే పనికొస్తుంది. చేసిన దరఖాస్తుల్లో కొన్ని పనికొచ్చేవయితే చాలావరకు రాజకీయపరమైనవని తెలిసిపోతోంది.దరఖాస్తుల్లో కొన్నయితే మరీ చీపుగా ఉందనే చెప్పుకోవాలి. దరఖాస్తు ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్న సమాచారాన్ని అధికారులు ఇవ్వరని తెలిసి కూడా బండి ప్రయత్నించటం కేవలం రచ్చచేయటానికే అని అర్ధమైపోతోంది.

ఇలాంటి దరఖాస్తుల్లో ఉదాహరణకు సీఎంగా కేసీయార్ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు ? అన్నది. కేసీయార్ ఎన్నిసార్లు సచివాలయానికి వస్తే ఏమిటి ? రాకపోతే ఏమిటి ? కేసీయార్ ఎక్కడుంటే అదే సచివాలయం. ప్రతిరోజు సచివాలయంకు రావాలనే రూలేమీలేదు కదా.

ఇంకో ప్రశ్నఏమిటంటే ముఖ్యమంత్రిగా ఎన్నిరోజులు ప్రగతి భవన్లు ఉన్నారు ? వ్యవసాయ క్షేత్రంలో ఎన్నిరోజులున్నారు ? ఈ ప్రశ్నలతో బండి సంజయ్ కు ఏమి సంబంధం ? కేసీయార్ ప్రగతిభవన్లో ఉంటే ఏమిటి ? వ్యవసాయక్షేత్రంలో ఉంటే ఏమిటి ? ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇదే సమయంలో కొన్ని ఉపయోగకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. 2014-22 మధ్య ఉద్యోగాల కల్పనకు జారీచేసిన నోటిఫికేషన్లెన్ని ? 2014-22 మధ్య నియోజకవర్గాల వారీగా అందుతున్న సాగునీరెంత ? అన్నది ఉపయోగకరమైనదే.

అలాగే 2014-22 మధ్యలో ఎస్సీ ఎస్టీల వారీగా జరిగిన భూపంపిణీ వివరాలు కావాలని అడిగారు. నిజానికి సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది ప్రజలందరికీ ఉపయోగపడే సమాచారాన్ని బహిర్గతం చేయాలని. ప్రజలు తెలుసుకోవాల్సిన వివరాలను గోప్యంగా ఉంచకూడదన్నదే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యం. అంతేకానీ ఈ చట్టాన్ని అడ్డపెట్టుకుని ప్రత్యర్ధులను ఇబ్బందులకు గురిచేయటం కాదు.