Begin typing your search above and press return to search.

అనిల్ అంబానీపై 3 నెలలు బ్యాన్.. వంద పేజీల్లో ఆదేశాలు జారీ

By:  Tupaki Desk   |   12 Feb 2022 11:32 AM GMT
అనిల్ అంబానీపై 3 నెలలు బ్యాన్.. వంద పేజీల్లో ఆదేశాలు జారీ
X
ఇద్దరు అన్నదమ్ములు తూర్పు పడమరలుగా మారటం అప్పుడప్పుడు.. అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కానీ.. వారి మధ్య వ్యత్యాసం మరీ ఇంతలా? అన్న రీతిలో ఉండటం మాత్రం చాలా అరుదు. దేశీయంగా తిరుగులేని సంపన్నులుగా పేరున్న అంబానీ అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న తర్వాత.. అన్న ఏ తీరులో దూసుకెళ్లారో.. అందుకు భిన్నంగా ఆయన సోదరుడు అనిల్ అంబానీ పరిస్థితి ఏ రీతిలో మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.

వేల కోట్ల ఆస్తులు కరిగిపోవటం.. అదే పనిగా నష్టపోవటం లాంటివి ఒక ఎత్తు అయితే.. తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా విధించిన బ్యాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీల కొనుగోలు.. అమ్మకం లేదంటే పరోక్షంగా డీల్ చేసేందుకు వీలు కాకుండా నిషేధాన్ని విధిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. అనిల్ అంబానీతో పాటు మరో ముగ్గురిపై కూడా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అనిల్ అంబానీ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు కూడా వీల్లేదని తాజా ఉత్తర్వుల్లో సెబీ స్పష్టం చేసింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సెక్యూరిటీలలో డీల్ చేయలేరని తేల్చిన సెబీ.. కంపెనీ నుంచి నిదులను మళ్లించారనే ఆరోపణలతో అనిల్ అంబానీతో పాటు మరో ముగ్గురిని సైతం మార్కెట్ లోకి ఎంట్రీ కాకుండా ఆపాలని డిసైడ్ అయ్యింది.

ఎందుకిలా అంటే.. కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ఉన్న ఆరోపణ. దీనికి సంబంధించి వంద పేజీల మధ్యంతర ఆదేశాల్లో మార్కెట్ నియంత్రణాధికార సంస్థ స్పష్టం చేసింది. అనిల్ అంబానీతో పాటు.. అమిత్ బప్నా.. రవీంద్ర సుధాకర్.. పింకేశ్ ఆర్ షాపైనా సెబీ బ్యాన్ విధించింది.

సెబీ వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియరీతో కానీ.. ఏ లిస్టెడ్ కంపెనీతో కానీ లేదా ఏ పబ్లిక్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు.. ప్రమోటర్ల నుంచి కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిధుల సమీకరణ చేపట్టకూడదని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనిల్ అంబానీకి ఇంతకు మించిన అవమానం మరింకేమీ ఉండేదమో?