Begin typing your search above and press return to search.

ఎప్పుడేం మాట్లాడాలన్న చిన్న విషయాన్ని సోనియా మిస్ అయ్యారా?

By:  Tupaki Desk   |   9 April 2020 3:54 AM GMT
ఎప్పుడేం మాట్లాడాలన్న చిన్న విషయాన్ని సోనియా మిస్ అయ్యారా?
X
కష్టంలో ఉన్ప వేళ అయితే సాయం చేయాలి. లేదంటే.. అన్ని మూసుకొని ఊరుకోవాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పించి మరింకేమీ రావు. ఎవరికి రాని ఐడియా.. తనకు మాత్రమే వచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక రథసారధి సోనియాగాంధీ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు కొత్త కలకలంగా మారింది. కరోనా వేళ.. ఖర్చులు తగ్గించుకోవాలంటూ ఐదు అంశాల్ని తెర మీదకు తెచ్చిన ఆమె.. రెండేళ్ల పాటు దిన పత్రికలకు ప్రకటనలు అన్నవి ఇవ్వకూడదని.. వాటి మీద పరిమితులు విధించాలన్న పెద్ద మాటను చెప్పేశారు.

విడి రోజుల్లో ఇలాంటి సలహాకు వచ్చే స్పందన ఎలా ఉన్నా.. కరోనా వేళ చస్తామా? బతుకుతామా? అన్నది అర్థం కాక కిందామీదా పడుతున్న మీడియా యాజమాన్యాలకు సోనియమ్మ సలహా కడుపు కాలేలా చేసింది. న్యూస్ పేపర్లతో కరోనా వ్యాపిస్తుందన్న దుర్మార్గపు ప్రచారంతో ఇప్పటికే మీడియా సంస్థలకు శాపంగా మారింది.

ఇంటి గమ్మం వద్దకు వచ్చే న్యూస్ పేపర్ తో రోజు మొదలు పెట్టే ఎంతోమందికి ఆ అలవాటు మిస్ అయ్యేలా చేయటమే కాదు.. న్యూస్ పేపర్ అంటేనే వణికిపోయేలా కరోనా చేసింది. పేపర్ తో కరోనా వస్తుందన్న ఫేక్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లటమే కాదు.. దాన్ని నమ్మేయటంతో ప్రింట్ మీడియా పరిస్థితి మహా ఇబ్బందిగా మారింది. పత్రికల్ని అమ్మితే వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోగా.. ప్రకటనల రూపంలో వచ్చే భారీ మొత్తాలు నిలిచిపోయాయి. దీంతో.. రోజువారీ ఖర్చులకు సైతం రిజర్వుఫండ్లు వాడేయాల్సిన దుస్థితి న్యూస్ పేపర్లకు వచ్చేసింది.

దీంతో.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఇలాంటి వేళ.. పేపర్లకు రెండేళ్ల పాటు ప్రకటనలు ఇవ్వొద్దంటూ సోనియా ఇచ్చిన సలహాతో.. మీడియా సంస్థలు కత్తులు నూరుతున్నారు. కరోనా సంక్షోభం వేళ.. ఎవరికి రాని ఐడియా తనకు వచ్చేసినట్లుగా చెప్పిన సోనియా సలహా కాంగ్రెస్ నేతలు తల పట్టుకుంటున్నారు. ఇలాంటివి అధికారంలో ఉన్న వారి నోటి నుంచి రావాల్సిందే కానీ.. విపక్షంలో ఉన్న తమకు కాదని వాపోతున్నారు. మీడియా సంస్థల పొట్ట కొట్టే సలహాగా పలువురు కాంగ్రెస్ నేతలు లోగుట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సూచన సోనియమ్మ లాంటి నేతకు రావటమా? అని ఆశ్చర్యపోతున్నారు. తేడా ఎక్కడ జరిగిందంటారు?