జగనన్న పంచాయతీ : బాలినేనితో స్టార్ట్... ప్లీనరీ ముందు పితలాటం

Tue Jun 28 2022 19:00:00 GMT+0530 (IST)

Balineni Srinivas Reddy In Ysrcp

జగన్ పంచాయతీలు పెట్టరు. అంటే పెద్దరాయుడు టైప్ లో ఆయన అటూ ఇటూ నేతలను పెట్టుకుని తగవు తీర్చరని అది ఆయన స్వభావం కాదని పార్టీ వర్గాల ద్వారా ప్రచారంలో ఉంది. ఆ మాటకు వస్తే అన్ని విషయాల మీద జగన్ కి ఫీడ్ బ్యాక్ ఉంటుందని ఆయన మాత్రం తన సన్నిహితులైన వారి ద్వారానే రెండు వర్గాలకు చెప్పించి కధ అక్కడితో ఫుల్ స్టాప్ పడేలా చూస్తారని అంటారు. వైసీపీలో ఇదే ఎపుడూ ఆనవాయితీగా వస్తోంది.ఇంకో మాట కూడా ఉంది. జగన్ ఒకసారి ఎవరిని అయినా నమ్ముతారని. వారి విషయంలో తేడా కొడితే మళ్ళీ పంచాయతీల పేరిట లాగి సాగదీసి కధను పెంచుకోవాలని చూడరని అక్కడితోనే  తెగ్గొడతరాని కూడా అంటారు. మనసు వేరే చోట ఉన్న వారు కానీ తనతో అడుగులు వేయడానికి ఇబ్బంది పడే వారు కానీ ఒక మాట చెబితే విని ఊరుకుంటారా అలా ఎంతకాలం బుజ్జగిస్తామన్నది జగన్ మార్క్ పాలిటిక్స్ అని అంటారు.

అయితే ఇదంతా పార్టీ అధినేతగా ఉన్నపుడు జరిగిపోయింది. కానీ ఇపుడు చూస్తే సీన్ అలా లేదు. అధికారంలో వైసీపీ ఉంది. మూడేళ్ళు ఇట్టే గడచిపోయాయి. మరో రెండేళ్ల పాలన ముగియగానే ఎన్నికలు తోసుకువచ్చేస్తాయి. మరోసారి గెలవాలీ అంటే ముందు పార్టీలో ఉన్న  నేతలను సెట్ చేసుకోవాలి.  వారు మనసు విరిగి  బయటకు పోకుండా చూసుకోవాలి. ఎన్నికల ముందు నేతలు జంపింగ్స్ చేస్తే మాత్రం అది వైసీపీ మీద తీరని ప్రభావం చూపిస్తుంది.

అయితే రాను రానూ వైసీపీలో గొడవలు పెరిగిపోతున్నాయి. దాంతో పాటు సీనియర్ జూనియర్ తేడా లేకుండా నేతలంతా రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా బాలినేని ఎపిసోడ్ చూస్తే ఆయన నిప్పులా మండిపోతున్నారు నాపైన కుట్ర చేస్తారా ఖబడ్దార్ అంటున్నారు. తన సొంత జిల్లా ఒంగోలులో అల్లూరి కవితా రెడ్డి మీద ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె టీడీపీ నేత దాచర్ల జనార్ధన్ మంత్రి శ్రీను వంటి నేతలతో ప్రతీ రోజూ మాట్లాడుతున్నారు అన్నది బాలినేని అనుమానం అభియోగం.

దాంతో ఆ కాల్ డేటాను తీసే పనిలో ఆయన నిమగ్నం అయి ఉన్నారని తెలుస్తోంది. కవితారెడ్డి కంటే వెనక ఉన్న సూత్రధారి ఎవరు అన్నది కూడా ఆయన ఆధారాలతో సహా గుట్టు తీసి జగన్ టేబిల్ మీద పెట్టనున్నారు అని అంటున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన బడా నేత ఒకరు దీని వెనక ఉన్నారు అన్నది బాలినేని అనుచరుల ఆరోపణ. ఆ బడానేతకు బాలినేనికి మొదటి నుంచి పడదు అని అంటున్నారు.  ఒక విధంగా ఈ ఇద్దరు నేతలూ వైసీపీలో కీలకం అయినా ఎడముఖం పెడముఖంగా ఉంటారు అని అంటున్నారు.

మరి ఆ పెద్ద నేత గురించి కూడా వివరాలు సేకరించి జగన్ ముందు పంచాయతీని పెట్టడానికి బాలినేని సిద్ధపడుతున్నారుట. జగన్ ప్రస్తుతం విదేశీ టూర్ లో ఉన్నారు. ఆయన పారిస్ నుంచి జూలై 3న తిరిగి వస్తారు. ఆ తరువాత 4న ప్రధాని టూర్ ఉంచి. దాంతో జూలై అయిదు తరువాత ఎపుడైనా బాలినేని సీఎం వద్దకు వెళ్ళి మొత్తం కుట్ర కధను తేల్చుకుంటారు అని అంటున్నారు. మరి బాలినేని ఆధారాలతో వస్తే పంచాయతీ పెట్టాల్సిన బాధ్యత జగన్ మీద పడుతుంది.

ఆయన ఏ కోశానా తప్పించుకోలేరు. సరే బాలినేని తగవు ఎలా తీరుస్తారు అన్నది పక్కన పెడితే బాలినేనితో పంచాయతీని స్టార్ట్ చేస్తే ఆ మీదట ఇంకా చాలానే పంచాయతీలు జగన్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ప్లీనరీని దగ్గరలో ఉంచుకుని ఈ పితలాటకాలు ఏంటి అన్న బాధ అయితే పార్టీలో ఉంది. మరి జగన్ ఏమంటారో. ఆయన అవునన్నా కాదన్న పెదరాయుడి అవతారం ఎత్తి పార్టీ తగవులు తీర్చాల్సిందే అంటున్నారు.