హిందూపురంలో వినూత్న కార్యక్రమానికి బాలయ్య శ్రీకారం!

Mon Aug 15 2022 13:07:04 GMT+0530 (IST)

Balayya started an innovative program in Hindupuram!

ఇప్పటికే హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎన్నో లక్షల మంది రోగులకు చక్కటి వైద్యం అందజేస్తున్న ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం పేరుతో బస్సును సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ బస్సు హిందూపురానికి చేరుకుంది.

ఈ ఉచిత ఎన్టీఆర్ ఆరోగ్య రథం కింద హిందూపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో 200కు పైగా వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. అంతేకాకుండా వైద్యులు ఆ వ్యాధులకు చికిత్స చేయడం మందులు అందిస్తారు. అలాగే ఆరోగ్య అవగాహన సదస్సులు గర్భిణులు బాలింతల ఆరోగ్యం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈ ఉచిత ఎన్టీఆర్ ఆరోగ్య రథం కోసం బాలయ్య రూ.40 లక్షలు ఖర్చు పెట్టారు.

ఈ వాహనం 108 మాదిరిగానే పనిచేస్తుందని సమాచారం. ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథంలో ఒక వైద్యుడు ఒక నర్సు ఒక ఫార్మసిస్ట్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఆరుగురు వైద్య సిబ్బంది ఉంటారు. అక్కడ సాధారణ వ్యాధులకు చికిత్స చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. ఆస్పత్రి సేవలు ఆపరేషన్ల అవసరం ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తారని తెలుస్తోంది.

ఉచిత ఎన్టీఆర్ ఆరోగ్య రథం హిందూపురం నియోజకవర్గంలో రోజుకొక గ్రామంలో పర్యటిస్తుంది. ‘అందరికీ ఆరోగ్యమస్తు... ప్రతి ఇంటికి శుభమస్తు... మన హిందూపురం మన బాలయ్య’ అని రథంపై రాయించారు. అలాగే ఎన్టీఆర్ బాలయ్య చిత్రాలు మాత్రమే ఆ బస్సుపై చిత్రీకరించి ఉండటం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటో ఆ బస్సుపై లేకపోవడం విశేషం. కాగా ఉచిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం సేవలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

కాగా హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు (2014 2019) గెలిచిన బాలయ్య 2024లో హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.