ఎంపీ సీటు మీద బాలయ్య అల్లుడి కర్చీఫ్ ...?

Wed Nov 24 2021 08:00:01 GMT+0530 (IST)

Balakrishna Son In Law Eyeing Mp Post

విశాఖ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు గీతం విద్యా సంస్థల చైర్మన్ అయిన భరత్ ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి చెప్పేశారు. బాలయ్యకు రెండవ అల్లుడు కూడా అయిన భరత్ 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. కేవలం మూడు వేల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం పక్కాగా గెలుపు తనదే అంటున్నారు. మరో రెండున్నరేళ్లలో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆయన కసరత్తు చేస్తున్నారు. తనదైన రాజకీయంతో ముందుకు సాగుతున్నారు.భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి రెండు సార్లు విశాఖ ఎంపీగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీగా సేవలు అందిస్తూ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భరత్ కి అటు తాత వైపు నుంచి బలం ఉంది. ఇటు మామ బాలయ్య అండ ఉంది. దానితో పాటు విశాఖలో విద్యా సంస్థల అధినేతగా పేరు తెచ్చుకున్నారు. మూడు పదుల వయసులో ఉన్న భరత్ రాజకీయంగా నవ యువకుడుగా చెప్పాలి. 2019లో ఆయన గెలుపు అంచుల దాకా వచ్చారు. నాడు ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.

చివరి నిముషంలో ఆయనకు టికెట్ లభించింది. అదే విధంగా చూస్తే జనసేన మూడవ పార్టీగా పోటీ చేయడం వల్ల కూడా టీడీపీకి పెద్ద దెబ్బ అయింది. అంతే కాదు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఎంపీగా బరిలో దిగడంతో టీడీపీ ఓట్లే పెద్ద ఎత్తున చీలిపోయాయి. మొత్తానికి చూస్తే భరత్ కి ఫస్ట్ అటెంప్ట్ లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే తాను ఓటమికి కృంగిపోనని పోటీ చేసి గెలిచి తీరుతానని భారత్ చెబుతున్నారు.

తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ మాట్లాడుతూ ఇతర పార్టీలతో పొత్తులలో తన ఎంపీ సీటు పోతుంది అని అనుకోవడంలేదని అసలు పొత్తుల ప్రసక్తి ఇపుడు లేనేలేదని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల వ్యవధి ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే వచ్చేసారి ఎంపీగానే తాను పార్లమెంట్ లో అడుగుపెడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ అధినాయకుడు చంద్రబాబుని కంటతడి పెట్టించడం బాధాకరమని ఆయన అన్నారు. రాజకీయాలు ఎవరైనా హుందాగా చేయాలని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లరాదు అన్నదే తన అభిప్రాయం అని చెప్పారు. అన్ని పార్టీలూ గీత దాటుతున్నాయని కూడా ఆయన పేర్కొనడం విశేషం. ఈ విషయంలో ఫుల్ స్టాప్ పడాలీ అంటే ప్రజలలో చైతన్యం రావాలని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి భరత్ పార్టీ నేతగా మాత్రమే కాకుండా రాజనీతితో మాట్లాడడమే ఇక్కడ ప్రస్థావనార్హం.