కోడెల మరణంపై బాలయ్య స్పందన.. తీవ్ర భావోద్వేగం

Mon Sep 16 2019 18:27:23 GMT+0530 (IST)

Balakrishna Responds on About Kodela Siva Prasada Rao Death

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు - నవ్యాంధ్రప్రదేశ్ తొలి  స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆకస్మిక మరణం రాజకీయ వర్గాలను కుదిపేసింది. కొంతకాలంగా రాజకీయ పరమైన ఒత్తిడిలో ఉన్న ఆయన సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలియడం తెలుగుదేశం పార్టీ వర్గాలను తీవ్రంగా కలచివేసింది. టీడీపీ పార్టీతో ఆయన అనుబంధం ఈ నాటిది కాదు. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు - నందమూరి ఫ్యామిలీ సభ్యులు కోడెల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కొద్దిసేపటి క్రితం కోడెల శివ ప్రసాద్ మృతిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే - సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. బసవతారకం హాస్పిటల్లో కోడెల మృత దేహాన్ని సందర్శించిన ఆయన తన పరామర్శను మీడియా ముఖంగా తెలియజేశారు. కోడెల మరణం పొందిన ఈ రోజు ఓ దుర్దినం అంటూ - ఆయన మరణించారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. బసవతారకం ఆస్పత్రి ప్రారంభించినపుడు ఆయనే ఫౌండర్ ఛైర్మెన్ అని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు బాలకృష్ణ. అప్పట్లో అమ్మగారి జ్ఞాపకార్థం నాన్నగారు ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నపుడు కోడెల ముందడుగు వేసి మంచి సహకారం అందించారని అన్నారు.

కేవలం రాజకీయ నాయకుడిగానే గాక వైద్యుడిగా కూడా ఎన్నో సేవలందించిన కోడెలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని బాలకృష్ణ అన్నారు.

పార్టీలకు అతీతంగా ఎంతోమందికి సేవలందించిన కోడెలను ఇలాంటి పరిస్థితిలో చూడటం శోచనీయం అని పేర్కొన్నారు బాలకృష్ణ. కోడెల మరణ వార్త విని షాకయ్యానని తెలుపుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాలకృష్ణ.