Begin typing your search above and press return to search.

బద్వేల్ ఉప ఎన్నిక : బీజేపీకి డిపాజిట్ దక్కేనా.. నేతల లెక్కలు ఇవే !

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 AM GMT
బద్వేల్ ఉప ఎన్నిక : బీజేపీకి డిపాజిట్ దక్కేనా.. నేతల లెక్కలు ఇవే  !
X
బద్వేల్ ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక్కడ పోటీలో నుండి టీడీపీ తప్పుకోవడంతో ఏకగ్రీవం అవుతుంది అని అనుకున్నారు. కానీ, సడెన్ గా రేసులోకి బీజేపీ వచ్చి మళ్లీ ఎన్నికలకి తెర లేపింది. అయితే , కడప జిల్లాలో వైసీపీ ని ఎదిరించే శక్తి , టీడీపీకే లేదు. అలాంటిది బీజేపీ వైసీపీని ఎదుర్కోవాలని చూస్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా బీజేపీ నాయకత్వానికి ఉన్నప్పటికీ , ఏపీలో అది కూడా కడప జిల్లాలో బీజేపీ గెలవగలం అనే నమ్మకం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం. చివరి ఎన్నికల్లో కనీసం వెయ్యి ఓట్లు కూడా రాని బీజేపీ , ఈసారి వైసీపీకి పోటీకి దిగుతుంది. పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే, కానీ, ఓట్లేయించుకోవడం ఎలా బద్వేల్‌ లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్‌ ఇదేనట, తాపీగా కూర్చుని డిపాజిట్‌ లెక్కలు వేసుకుంటున్నారట.

బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్‌ మెంబర్‌ కుటుంబానికే టిక్కెట్‌ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి. దీంతో అధికారపార్టీకి ఎదురుగా బీజేపీనే పోటీకి ఉంది. ఈ పరిస్థితుల్లో బద్వేలులో బీజేపీ పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గడచిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 735 ఓట్లు వచ్చాయి. డిపాజిట్‌ రాలేదు. ఈసారైనా డిపాజిట్‌ దక్కుతుందా లేదా అని కడప జిల్లాలోని బీజేపీ నేతలే చర్చించుకునే పరిస్థితి ఉంది. బద్వేలులో సుమారు 2 లక్షల 14 వేల మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. 2019లో లక్షా 50 వేల మంది ఓటేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే.. బీజేపీ అభ్యర్థి సురేష్‌కు కనీసం 25 వేలకుపైగా ఓట్లు పోల్‌ కావాలి. కానీ, అన్ని ఓట్లు వస్తాయా అని బీజేపీ నేతలే చర్చించుకుంటున్నారు.

జనసేన పోటీ చేయకున్నా మిత్రపక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బద్వేలు పరిధిలో బలిజ సామాజికవర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. జనసేన మద్దతువల్ల బలిజ సామాజికవర్గం నుంచి కాస్తో కూస్తో ఓట్లు వస్తాయని లెక్కలేస్తున్నారట. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదన్నది ఒక ప్రశ్న. గత ఎన్నికల్లో లెఫ్ట్‌, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న జనసేన, బద్వేల్‌ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. అప్పుడు బీఎస్పీ అభ్యర్థికి కేవలం1321 ఓట్లే పడ్డాయి. టీడీపీ పోటీలో లేకపోవడంతో.. వైసీపీ సర్కార్‌ వ్యతిరేక ఓటర్లంతా తమకే వేస్తారనేది బీజేపీ మరో అంచనా. బద్వేలు పరిధిలో ఉన్న గోపవరం మండలం ఎంపీపీ, జడ్పీటీసీలను కైవశం చేసుకుంది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ బరిలో ఉంటే పోటీ కాస్త టైట్‌గా ఉండొచ్చనే భావించారు.

ఇప్పుడు ఆ మండలానికి చెందిన ఓటర్లు.. టీడీపీ సానుభూతిపరులు బీజేపీకి ఓటేస్తారన్నది కమలనాథుల లెక్క. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడే పనిలో బీజేపీ కడప జిల్లా ముఖ్యులు బిజీగా ఉన్నారట. బీజేపీ కాగితాలపై వేస్తున్న లెక్కలు భారీగా ఉన్నా క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు వర్కవుట్‌ అవుతాయన్నది ప్రశ్న. టీడీపీ పోటీలో లేకున్నా, జనసేన మద్దతిచ్చినా, డిపాజిట్‌ వస్తుందా రాదా అన్న డౌట్‌ అలాగే ఉందట. అందుకే ఈదఫా బీజేపీకి డిపాజిట్‌ దక్కితే అతిపెద్ద అద్భుతమే అని చెప్పాలి.