Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఉల్లి.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   22 Oct 2021 6:35 AM GMT
అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఉల్లి.. ఎందుకంటే?
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు మహమ్మారి కరోనా ఇచ్చిన షాకు అలాంటి ఇలాంటిది కాదు. ఇప్పటివరకు ఆ దేశంలో.. మహమ్మారి కారణంగా భారీగా మరణాలు చోటు చేసుకున్న అరుదైన రికార్డు కొవిడ్ దే. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా దెబ్బకు అమెరికన్లు కిందా మీదా పడుతున్నారు. ఈ తలనొప్పి ఒక కొలిక్కి రాకుండానే.. తాజాగా ఇప్పుడు వారిని మరో సమస్య వెంటాడుతోంది. ఉల్లిపేరు వింటేనే వారు ఉలిక్కిపడుతున్నారు. కారణం.. సొల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఇప్పుడు ఉల్లి ద్వారా వ్యాపించి.. తీవ్ర అస్వస్థతకు గురి చేయటమే.

ఇటీవల కాలంలో అమెరికా.. కెనాడాల్లో ఉల్లి ద్వారా వ్యాపిస్తున్న బ్యాక్టిరీయాతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో.. ఉల్లిని చూస్తే చాలు అమెరికన్లు వణికిపోతున్నారు. విపరీతమైన కడుపునొప్పి.. డయేరియా.. జ్వరం.. వాంతులు.. మలంలో రక్తం లాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ.. తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఐదేండ్ల చిన్నారి మొదలు 65 ఏళ్లపెద్ద వయస్కుల వరకు ఇబ్బంది పెడుతున్న ఈ అనారోగ్యానికి కారణం.. ఉల్లిగడ్డలోని బ్యాక్టీరియాగా కాలిఫోర్నియాకు చెందిన థామ్సన్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించింది. ఆ వెంటనే ప్రజల్ని అప్రమత్తం చేసింది.

ఇది మొదలు.. ఉల్లిని చూస్తేనే భయపడిపోతున్నారు అమెరికాన్లు. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం అక్కడి 37 రాష్ట్రాల్లోని 650 మంది సొల్మోనెల్లా బ్యాక్టీరియా బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా టెక్సాస్.. వర్జీనియా.. కాలిఫోర్నియాలో దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఉల్లిగడ్డల నుంచి వ్యాపిస్తున్నట్లుగా తేల్చిన వైద్య శాఖ.. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలే కారణమని గుర్తించారు. ఎరుపు.. తెలుపు.. గోధుమ రంగులో ఉండే ఈ ఉల్లి స్టాకును వెంటనే బయట పడేయాలని.. షాపుల్లో ఉంటే.. వాటిని తీసేసి.. శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. నీళ్లను ఎక్కువగా తాగటం ద్వారా దీని బారి నుంచి కాస్త బయటపడే వీలుందన్న మాట వినిపిస్తోంది.