ఎట్టకేలకు కుప్పం ఓటమిపై నోరు విప్పిన బాబు

Thu Nov 25 2021 14:06:42 GMT+0530 (IST)

Babu finally opens his mouth on defeat of Kuppam

టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడి అడ్డా లాంటి కుప్పంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావటం.. ఆయన సొంత పరాజయంగా భావించటం తెలిసిందే. కుప్పం కోటను బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో ఏపీ అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నించి.. ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. స్థానిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వేళలో వైసీపీ శ్రేణులు ఎంత ఆనందానికి గురయ్యాయో.. అంతకు రెట్టింపు ఆనందం కుప్పం విజయాన్ని వారికి అందించింది.కుప్పంలో ఎదురైన అనూహ్య ఓటమిపై చంద్రబాబు స్పందించలేదు. ఫలితాలు వెలువడి వారం అవుతున్నా ఆయన స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. అలాంటి ఆయన తాజాగా స్పందించారు. కుప్పంలో ఎదురైన ఓటమి గురించి మాట్లాడిన ఆయన.. ‘రౌడీయిజం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కుప్పంలో జరిగిన దానిని ఇప్పుడు ఇష్యూగా చేస్తున్నారు. మొనగాళ్లమని విర్రవీగుతున్నారు.దొంగ ఓట్లు వేసి దౌర్జన్యంగా గెలిచారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలన్ని ఆయన చిత్తూరు జిల్లాలో వరదలకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వ్యాఖ్యానించటం విశేషం. సాధారణంగా విపత్తు వేళ.. మొత్తంగా నష్టపోయి వేదనలో ఉన్న బాధితులకు సాంత్వన కలిగేలా.. వారికి ధైర్యాన్ని కలిగించేలా మాట్లాడుతుంటారు. అంతే తప్పించి రాజకీయ విమర్శలు.. వ్యాఖ్యలు చేయటం చాలా తక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా చంద్రబాబు మాత్రం రాజకీయ అంశాల్ని పరామర్శ సందర్భంగా ప్రస్తావించారు.

కుప్పంలో దొంగ ఓట్లు వేసి దౌర్జన్యంగా గెలిచారన్న చంద్రబాబు.. తన భార్యను అవమానించారని.. అందుకే కౌరవ సభలో తాను ఉండనని చెప్పి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని బయటకు వచ్చినట్లుగా వెల్లడించారు. తాను ఎన్నో సంక్షోభాల్ని ఎదుర్కొన్నానని.. క్లైమోర్ మైన్స్ పేల్చితేనే భయపడలేదన్న ఆయన.. వరదల నియంత్రణలోనూ.. సాయం చేయటంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.

విపత్తులు విరుచుకుపడిన వేళలో.. బాధితులకు సాయం అందించేందుకు రాత్రిళ్లు కూడా కలెక్టర్లతో మాట్లాడి పని చేయించిన వైనాన్ని గుర్తు చేశారు. మొత్తంగా వరద కారణంగా నష్టపోయిన వారి వద్దకు వెళ్లిన చంద్రబాబు.. వారిని ఓదార్చటం కంటే కూడా తన వేదన చెప్పుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం.