Begin typing your search above and press return to search.

యూటర్న్ కు బాబు బ్రాండ్ అంబాసిడరే... ఇదిగో సాక్ష్యం

By:  Tupaki Desk   |   8 Nov 2019 4:10 PM GMT
యూటర్న్ కు బాబు బ్రాండ్ అంబాసిడరే... ఇదిగో సాక్ష్యం
X
టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును ఆయన వైరి వర్గాలు యూటర్న్ కు ఆద్యుడి గానే చెబుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకు బోలెడన్ని సాక్ష్యాలను కూడా వైరి వర్గాలు ఉదహరించిన, ఉదహరిస్తున్న వైనాలు కూడా మనకు తెలిసిందే. వైరి వర్గాలు అంటున్నట్లుగానే చంద్రబాబు... యూటర్న్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన వైనం మరో ఘటన చోటుచేసుకుందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటమే లక్ష్యంగా సాగిన చంద్రబాబు... తన ప్లాన్లన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మోదీని ఆకాశానికెత్తేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బహు బాగున్నాయంటూ చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నిజం గానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.


అయినా మోదీ ని కీర్తిస్తూ చంద్రబాబు ఏమని వ్యాఖ్యానించారన్న విషయానికి వస్తే... భారత్‌ లో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ప్రధాని మోదీ చేస్తున్న కృషి ని తాము సమర్థిస్తున్నట్లు చంద్ర బాబు సంచలన వ్యాఖ్య చేశారు. దేశంలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధ్యమేనని బాబు ఈ సందర్భంగా రూలింగ్ కూడా ఇచ్చేశారు. అంతే కాందండోయ్... భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మారడం ఎలా సాధ్యమనే దాని పై టీడీపీ తరఫున ఓ డిటైల్డ్ డాక్యుమెంట్‌ కూడా ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మొత్తంగా ఎన్నికలకు ముందు మోదీ విధానాలను తూర్పార బట్టిన చంద్రబాబు... ఇప్పుడు మోదీ మరోమారు అధికారం లోకి రావడం, తాను మాత్రం విపక్షంలోకి మారిన నేపథ్యంలో చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారన్న మాట.


మోదీ తన తొలి టెర్మ్ లో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుపై తొలుత మద్దతు పలికినట్లుగానే స్పందించిన చంద్రబాబు.. ఆ తర్వాత జనాన్ని ఇంతగా ఇబ్బంది పెడతారా? అంటూ మోదీపై అంతెత్తున ఎగిరి పడ్దారు. అంతేకాకుండా ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ఓటమే తన లక్ష్యమంటూ మొన్నటి ఎన్నికలకు ముందుగా ప్రతినబూనిన చంద్రబాబు... మోదీ వ్యతిరేకులను ఏపీకి పిలిపించి మరీ టీడీపీ తరఫున ప్రచారం చేయించారు. తీరా తాను ఎన్ని చేసినా... మోదీని ఓడించ లేకపోయిన చంద్రబాబు... తాను కూడా ఓటమి పాలవడంతో చాలా నెమ్మది గానే అయినా పకద్బందీ ప్లాన్ తో బీజేపీ కి దగ్గరయ్యేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా మోదీ విధానాలను ఆకాశానికి ఎత్తేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.