Begin typing your search above and press return to search.

మెడకు చుట్టుకున్న ‘అల్లోపతి కేసులు’.. సుప్రీంకు రాందేవ్ బాబా

By:  Tupaki Desk   |   23 Jun 2021 3:30 PM GMT
మెడకు చుట్టుకున్న ‘అల్లోపతి కేసులు’.. సుప్రీంకు రాందేవ్ బాబా
X
'అనవసరంగా నోరు పారేసుకోవడం ఎందుకు.. ఇప్పుడు కేసుల బాధకు సుప్రీంకోర్టుకు ఎక్కడ ఎందుకు?' అని యోగా గురువు రాందేవ్ బాబా గురించి నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. రాందేవ్ బాబాది స్వయకృతాపరాధం అని కామెంట్ చేస్తున్నారు. అల్లోపతి మందులపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు.. డాక్టర్ల పరువు తీసేలా ఆయన కామెంట్లు చేశారు.

దేశంలో సెకండ్ వేవ్ రావడం.. దాని ధాటికి లక్షలమంది చనిపోవడం విషాదం నింపింది. ఈ క్రమంలోనే 'అల్లోపతి మందులు, వైద్యం కరోనాను కట్టడి చేయలేదని.. అదో పనికిమాలిన వైద్యం అని.. లక్షల మందిని కోల్పోవడానికి కారణం అల్లోపతి మందులేనని యోగి గురువు రాందేవ్ బాబా చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వైద్యులు మండిపడ్డారు. ఏకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే రాందేవ్ బాబాకు లీగల్ నోటీసులు పంపించింది. 1000 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తూ పరువు నష్టం వేసింది. రాందేవ్ పై పలు కేసులు నమోదయ్యాయి.

అయితే రాందేవ్ బాబా మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. వైద్యులు కూడా ఈ విషయంలో సీరియస్ గానే స్పందించారు. అయితే తాజాగా తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని రాందేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే రాందేవ్ వివాదంపై కేంద్రఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ సైతం రంగంలోకి దిగారు. రామ్ దేవ్ కు సర్దిచెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చేశారు. రాందేవ్ సైతం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పాడు. వైద్యులను భూమిపై దేవదూతలు అంటూ అభివర్ణించాడు. వివాదాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేశారు.

తాజాగా సుప్రీంకోర్టులో తనపై ఉన్న అన్ని కేసులపై స్టే కోసం రాందేవ్ బాబా పిటీషన్ దాఖలు చేశారు. అన్ని కేసులు ఒకే చోటకి బదిలీ చేయాలని.. అంతేకాకుండా కేసులన్నింటిపై స్టే విధించాలని ఆయన సుప్రీంకోర్టులో కోరారు. పాట్నా, రాయ్ పూర్ లో ఐఎంఏ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లపై విచారణను నిలిపివేయాలని రాందేవ్ బాబా పిటీషన్ లో కోరారు. ఎఫ్ఐఆర్ లను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు వాదనలు విన్నది తీర్పును రిజర్వ్ చేసింది.

రాందేవ్ బాబాపై చాలా కేసులు నమోదైనా కూడా ముఖ్యంగా ఐఏఎం చత్తీస్ గడ్ యూనిట్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. దీనిపై రాందేవ్ కు నోటీసులు జారీ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసు ఇబ్బందికరంగా మారడంతోనే రాందేవ్ బాబా తన కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.