చెత్త స్కాం.. ఇరుక్కుపోయిన సిద్ధూ

Wed Sep 11 2019 16:55:23 GMT+0530 (IST)

BS Yediyurappa Orders CBI probe Into 5 cases on Siddramaiah

అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతల పని పడుతున్న బీజేపీ పెద్దలు... తాజాగా కర్ణాటక మాజీ సీఎం - కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను టార్గెట్  చేసింది. సిద్దూ సీఎంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐదు భారీ స్కాంలపై సీబీఐ విచారణ చేయాలని కర్ణాటక సీఎం యడ్యూరప్ప తాజాగా ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది.కర్ణాటకకు సీఎంగా సిద్దరామయ్య ఉన్న సమయంలో బెంగళూరులో చెత్త సేకరించే పేరుతో వాహనాల కొనుగోలు - రీసైక్లింగ్ కోసం 1066 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని.. ఇందులో భారీగా గోల్ మాల్ జరిగిందని తాజాగా బీజేపీ నాయకుడు ఎన్ఆర్ రమేష్.. బుధవారం సీఎం యడ్యూరప్పకు ఫిర్యాదు చేశారు. ఇదే కాదు సిద్ధూ హయాంలోనే కృషి భాగ్య పథకంలో 9014 కోట్లు - వైజ్ఞానిక చెత్త వేరే చేసే ప్లాంట్ పేరుతో 4010 కోట్ల అవినీతి జరిగిందని రమేష్ ఆధారాలతో సీఎం యడ్యూరప్పకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు - అధికారులు వందల కోట్లు స్వాహా చేశారని దీనిపై విచారణ జరపాలని కోరారు.

దీనిపై సీఎం యడ్డీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిద్దూ హయాంలో అమలు చేసిన ఐదు పథకాల్లో భారీ స్కాం జరిగిందని వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ స్కాంలో సిద్ధరామయ్యతోపాటు కర్ణాటక మాజీ మంత్రి కృష్ణ బైరేగౌడ - వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శులు - 26 జిల్లాల వ్యవసాయ శాఖ డైరెక్టర్లు - 131 తాలూకాల వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నారు. వీరిందరితోపాటు ఈ చెత్త సేకరించే కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులు కూడా ఈ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ స్కాంలు అందరి మెడకు చుట్టుకుంటాయనే భయంతో కన్నడనాట ఇప్పుడు వారంతా బెంబేలెత్తిపోతున్నారు.సిద్దూతోపాటు చాలా మంది రాజకీయ భవిష్యత్ ఈ సీబీఐ కేసులతో  ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.