Begin typing your search above and press return to search.

మోడీ మీద కసితో...చేస్తున్నది కరెక్టేనా....?

By:  Tupaki Desk   |   6 Oct 2022 1:50 AM GMT
మోడీ మీద కసితో...చేస్తున్నది కరెక్టేనా....?
X
జాతీయ పార్టీ పెట్టడం అంటే మరీ ఇంత సులువా. పైగా పాన్ ఇండియా మూవీతో కొందరు పోలుస్తున్నారు. మరి కొందరు దేశంలోని అన్ని పార్టీలూ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మేమే ఆల్టర్నేషన్ అని ధీమాగా చెబుతున్నారు. అసలు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్నది చూడాల్సిన అవసరం లేదా. ఈ దేశం గురించి మేధావులు చెప్పిన మాట ఒకటి ఉంది. అడుగు తీసి అడుగు పెడితే ప్రతీ అడుగులోపలా కల్చర్ మారిపోతుంది. వేషం మారుతుంది. భాష మారుతుంది. ఇలా ఇంతటి విభిన్నమైన సమాజం బహుశా ప్రపంచంలోనే ఎక్కడా ఉండదేమో.

అలాంటిది ఈ దేశంలో ఏక పార్టీగా కాంగ్రెస్ ఏలింది. కొన్ని దశాబ్దాల పాటు ఈ దేశాన్ని కట్టి ఉంచింది. దానికి కారణం స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని ఒక ఎమోషన్ని క్రియేట్ చేయడమే. అది చాలా కాలం పాటు సాగింది. ఆ తరువాత జన చైతన్యంతో అది కాస్తా అర్ధమై ఆవిరై కాంగ్రెస్ పాలనలోని లోటు పాట్లు చర్చకు వచ్చి చివరికి కాంగ్రెస్ కి సరైన ఆల్టర్నేషన్ కావాలన్న ప్రయత్నం మొదలిన నాలుగు పదుల తరువాత పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఇక బీజేపీ దేశాన్ని ఏలడానికి పురిటి నొప్పులు ఎన్నో పడింది. బీజేపీ దేశాన్ని అనుసంధానం చేసేందుకు హిందూత్వను ఉపయోగించుకుంది. అది ఆసేతు హిమాచలం పట్టకపోయినా మెజారిటీ చోట్ల ఎమోషన్ గా మారి కమలానికి రాజకీయ గట్టిదనం సమకూరింది. ఈ రెండు పార్టీలతో పాటు చాలా జాతీయ పార్టీలు దేశంలో ఉన్నాయి. సమస్యల మీద అభివృద్ధి అజెండా మీద మాట్లాడాలీ అంటే వామపక్షాలు మొదటే ఉన్నాయి. కానీ ఆ పార్టీలు దేశాన్ని ఏకమొత్తంగా కట్టి ఉంచే ఎమోషన్ని క్రియేట్ చేయలేకపోయాయి. కనీసం అరడజన్ రాష్ట్రాలలో కూడా తమ ప్రభావాన్ని సుదీర్ఘకాలం చూపించి అధికారం అందుకోలేకపోయాయి.

అనేక ప్రాంతీయ పార్టీలు కూడా తామున్న చోట గెలిస్తే దేశమంతా తమదే అనుకుని జబ్బలు చరచి జాతీయ రాజకీయ యవనిక మీద పరచుకుందామని ప్రయత్నం చేశాయి. కానీ ఫలితం శూన్యం. అలాంటిది టీయారెస్ అనబడే ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో జాతీయ పార్టీగా బలంగా ముందుకు వస్తానని అంటోంది. ఆరాటం మంచిదే కానీ దానికి ప్రాతిపదిక ఏమిటి. నినాదం ఏమిటి. వీటికి మించి దేశాన్ని కట్టి పడేసే ఎమోషనల్ బాండేజి ఏమిటి అన్నది చూసినపుడు జవాబులు ఈ రోజుకు అయితే లేవు.

రాజకీయాల్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అవి కులం, మతం, ప్రాంతం, ఇంకా ఆనేకం ఉన్నాయి. మరి ఇవి కాకుండా సమస్యలు అభివృద్ధి అంటే ప్రతీ చోటా అదే నినాదంతో ప్రతీ రాజకీయ పార్టీ తనదైన రాజకీయం పండిస్తూనే ఉంది. వారిని కాదని కొత్తగా స్పెషల్ గా చేయలనుకుంటే టీయారెస్ వైపు చూడాలి. మరి ఆ విధంగా చెప్పగలితే సత్తా సామర్ధ్యం టీయారెస్ కి ఉందా. ఉంటే జాతీయ రాజకీయాల్లో పోరాడవచ్చు.

కాకపోతే మాత్రం మోడీ మీద కసితోనో, లేక బీజేపీ మీద కోపంతోనో రాజకీయ పార్టీ పెట్టామని అంటే అది కుదిరే వ్యవహారం కాదు. ఇక్కడ సింపుల్ గా ఒక్క మాట చెప్పాలి. రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నా ఏపీలో భారత్ రాష్ట్ర సమితికి పెద్దగా ఊపు వస్తుందని ఇప్పటికైతే ఎవరూ అనుకోవడంలేదు. పైగా ఏపీ విభజన సమస్యలకు టీయారెస్ కారణం అని భావిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు.

అది పక్కన పెట్టినా కేసీయార్ నినదించే అభివృద్ధి సంక్షేమం లాంటివి ఏపీలోని రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో అంటున్నాయి, వీలుని బట్టి అమలు చేస్తున్నాయి. మరి కేసియార్ కొత్తగా పార్టీ పెట్టారని చంకనెత్తుకోవాల్సిందే అంటే కుదిరే పనేలా. సో తెలంగాణా వరకూ పట్టు సాధించి తన రాజకీయ క్షేత్రంగా దాన్ని మార్చుకున్న కేసీయార్ అక్కడే ఉంటే బెటరేమో అన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఆయన అనవసరంగా చేయి కాల్చుకుంటున్నారా అన్నదైతే జరుగుతున్న చర్చ మరి. చూడాలి దీనికి జవాబు కాలం ఏమి చెబుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.