Begin typing your search above and press return to search.

హవ్వా.. మనుగోడులో బీజేపీ, బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది ఇంతేనట.?

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:21 AM GMT
హవ్వా.. మనుగోడులో బీజేపీ, బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది ఇంతేనట.?
X
మనుగోడు ఉప ఎన్నికపై దేశ వ్యాప్తంగా చర్చ సాగింది. ఇక్కడ తాము గెలవాలని బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ ఎన్నికతో ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా ఆధిపత్యం కోసం ఒకరి కంటే మరొరకు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా భారీగా డబ్బు పంచినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల తమకు నగదు అందలేదని ఓటు వేయమని భీష్మించుకున్న ఓటర్ల వీడియోలు మీడియాలో ప్రసారం అయ్యాయి కూడా.

అలాగే మద్యం ఏరులై పారిన విషయం కళ్లకు గట్టినట్లు వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికలో ఒక్కో పార్టీ కోట్ల రూపాయల ఖర్చు చేశారని పరోక్షంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంస్థ ఈ ఎన్నికల ఖర్చు వివరాలు తెలపాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసింది. దీనిపై అధికారులు ఇచ్చిన వివరాలుచూసి ఆంతా షాక్ అవుతున్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్ ల ఖర్చు 1.20 కోట్లు కూడా దాటలేదట.

మునుగోడు ఉప ఎన్నికలో పార్టీలు పెట్టిన ఖర్చు వివరాలు అందించాలని 'యూత్ ఫర్ యాంటీ కరప్షన్' అనే సంస్థ తెలంగాణ ఎన్నికల అధికారిని ఆర్టీఐ ద్వారా కోరింది. దీంతో ఆయన నల్లగొండ కలెక్టర్ కు వివరాలు అందించాలని ఆ దరఖాస్తును పంపించారు. కలెక్టర్ అందించిన వివరాలను 'యూత్ ఫర్ యాంటీ కరప్షన్' సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి బయటకు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 4 పార్టీలే ప్రధానంగా ఎన్నికల కోసం ఖర్చు చేశాయన్నారు. వీటిలో బీజేపీ, బీఆర్ఎస్ లు 1.20 కోట్లు కూడా దాటలేదని వివరించారు.

కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత మునుగోడును చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అటు కాంగ్రెస్ కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే మకాం వేశారు. అటు బీజేపీ నుంచి కీలక నాయకులు మునుగోడులోనే ఉండి ప్రచారం చేశారు. వీరంతా ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఒక సభలో వంద మందికి పైగా కూర్చునే స్థాయి ఉన్నట్లు కనిపించింది. ఈ సభ నిర్వహణకు ఎంత ఖర్చు కావాలి..? ఇక్కడికి నాయకులు రావడానికి పెట్రోల్, డీజీల్ కు ఎంత వెచ్చించాలి..? కానీ వీటి ఖర్చు రూ.35 లక్షలు కూడా దాటలేదట.

ఒక ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఓటుకు రూ.10 వేలు పంచినట్లు ప్రచారం జరిగింది. కొన్ని పార్టీల నాయకులు డబ్బులు పంచుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇక తమకు డబ్బులు అందడం లేదని, అందువల్ల మేం ఓటెయ్యమని ఓ గ్రామానికి చెందిన వారు ఎన్నికల కేంద్రానికి రాకుండా నిరసన చేసిన విషయం కూడా బయటపడింది. చివరి వారిని బుజ్జగించేందుకు ఎంత ఖర్చయింది..? అనేవి సాధారణంగా లెక్కలు వేసినా కోట్ల దాటుతాయి. మరోవైపు మద్యం ఏరులై పారింది. ఎన్నిక పూర్తయ్యే వరకు మద్యం షాపులు కిటకిటలాడాయి. ఈ లెక్కన ఒక్కో పార్టీ ఎంత ఖర్చుపెట్టాలి..?

కానీ అవేం లేకుండా ప్రధాన పార్టీలు అతి తక్కువ ఖర్చుపెట్టాయని వివరాలు అందించడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్.. అధికారంలో లేని కాంగ్రెస్ కంటే తక్కువ ఖర్చుపెట్టిందట. దీంతో హవ్వా.. మనుగోడులో బీజేపీ, బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది ఇంతేనట.? అని అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.