మోడీ ఏకఛత్రాధిపత్యం.. దేశంలో 50 రాష్ట్రాలకు పక్కా ప్లాన్?!

Sat Jun 25 2022 21:00:01 GMT+0530 (IST)

BJP senior leader, Minister Umesh katti sensational remarks

కేంద్రంలోని నరేంద్ర మోడీ.. ఏకఛత్రాధిపత్య రాజకీయాలకు మరింత పదును పెంచుతున్నారా? ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత.. దేశాన్ని మరిన్ని చిన్నచిన్న రాష్ట్రాలుగా విభజించి.. తనకు అనుకూలంగా.. బీజేపీకి అమేయంగా.. మద్దతును కూడగట్టుకునే పనిలో పడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు.కర్ణాటక  బీజేపీ సీనియర్  నాయకుడు మంత్రి ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడుతాయన్నారు. ప్రధాని మోడీ కర్ణాటకలో పర్యటించిన కొన్ని రోజులకే అధికారపార్టీ సీనియర్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందన్న ఆయన.. ఈ విషయంపై ప్రధానమంత్రి ఆలోచిస్తు న్నట్లు తనకు తెలిసిందన్నారు.  2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పారు. ఇదే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. అందులో భాగంగా కర్ణాటక కూడా రెండు కాబోతోందని ఉమేశ్ కత్తి చెప్పారు.

ఈ క్రమంలో కొత్తగా ఉత్తర కర్ణాటక ఏర్పడేందుకు మనం పోరాడాలి అంటూ మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో  ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రెండు ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగు మహారాష్ట్రలో మూడు.. కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయంటూ చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మంచి అంశమేనన్న ఆయన.. ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యూహం ఏంటి?ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. గతంలో యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేస్తారని.. తొలుత చెప్పింది ఆయనే. అదేవిధంగా కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చెప్పింది కూడా ఆయనే.

ఈ నేపథ్యంలో ఉమేశ్ కత్తి వ్యాఖ్యలు నిజమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదంతా కూడా మోడీ మరింతగా రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్న భాగంగానే చూడాలని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.