Begin typing your search above and press return to search.

స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటీషన్

By:  Tupaki Desk   |   8 July 2020 11:45 AM GMT
స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటీషన్
X
న్యాయవ్యవస్థపై ఇటీవల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమినేని సీతారాంపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ వ్యాఖ్యలు న్యాయస్థానాల గౌరవాన్ని దిగజార్చాయని, న్యాయవ్యవస్థపై సామాన్యుల విశ్వాసాన్ని తగ్గిస్తుందని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రమేష్ నాయుడు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సీతారాంపై హైకోర్టు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రమేశ్ నాయుడు డిమాండ్ చేశారు. స్పీకర్ న్యాయవ్యవస్థ పరువు తీసేలా వ్యాఖ్యానించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని.. శాసనసభ అధిపతిగా ఆయన తన పరిమితులను అతిక్రమించారు అని రమేశ్ నాయుడు అన్నారు.

ఇటీవల తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలలో కోర్టులు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రశ్నిస్తూ వరుస తీర్పులు ఇచ్చి, వివిధ అంశాలపై ఆదేశాలు ఇచ్చినందుకు తమ్మినేని సీతారాం కోర్టులపై ఈ దాడి చేశారు.

"రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలి.. ఏం చేయకూడదనేది కోర్టు నిర్ణయించగలిగితే, ఎన్నికల ఉద్దేశ్యం ఏమిటి? ప్రజలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎందుకు ఎన్నుకోవాలి.. పాలన చేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి.? అసెంబ్లీ మరియు స్పీకర్ ఎందుకు ఉన్నారు ? కోర్టులు నేరుగా ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్రాన్ని పాలిస్తే సరిపోతుంది కదా” అని సీతారాం ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ హైకోర్టుకు ఎక్కింది.