దత్తన్న వారసురాలు రెడీ.. బీజేపీ ఓకేనా...?

Thu Oct 06 2022 20:24:49 GMT+0530 (India Standard Time)

BJP on Daughter of Dattatreya

తన జీవిత కాలన్ని అంతా బీజేపీ కోసం అంకితం చేసిన వారు బండారు దత్తాత్రేయ. ఆయన రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. కేంద్ర మంత్రిగా పనిచేసారు. ఇపుడు హర్యానా గవర్నర్ గా ఉంటున్నారు. ఆయన రాజకీయ వారాసురాలుగా ఏకైక కుమార్తె బండారు విజయలక్ష్మి రావడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి అన్నీ సమకూర్చుకుంటున్నారు.ఆ విషయాన్ని ఆమె అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రకటించేశారు. తన తండ్రి దత్తాత్రేయతో పాటు సినీ రాజకీయ  ప్రముఖుల సమక్షంలోనే ఆమె ఈ విషయాన్ని తెలియచేశారు. బీజేపీ కనుక తనకు రాజకీయ అవకాశాన్ని కల్పిస్తే తాను సిద్ధమని చెప్పేశారు. తాను రాజకీయాల్లో పనికొస్తానని బీజేపీ భావిస్తే తన సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమె అంబర్ పేట సీటు మీద కన్నేశారు అని అంటున్నారు.

ఈ సీటు మీద గతంలో కిషన్ రెడ్డి గెలిచి ఉన్నారు. బీజేపీకి ఇది గట్టి సీటుగా గెలిచే సీటుగా చెబుతారు. ఇక కిషన్ రెడ్డి దత్తాత్రేయ ఖాళీ చేసిన సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి అదే సీటు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

దాంతో ఆయన సొంత అసెంబ్లీ సీటు అయిన అంబర్ పేట నుంచి పోటీకి దత్తాత్రేయ కుమార్తె రెడీ అవుతున్నారని వినిపిస్తున్న మాట. అయితే కిషన్ రెడ్డి తన సొంత సీటుని దత్తన్న ఫ్యామిలీకి త్యాగం చేయడానికి ఏమంటారో చూడాలి. కిషన్ రెడ్డి పోటీ చేయకపోతే ఆయన అనుచరులు ఎవరైనా రంగంలోకి దిగుతారేమో కూడా చూడాలి.

ఇక వచ్చే ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్న బీజేపీ ఎంపీలను కేంద్ర మంత్రిని  కూడా పోటీకి దించబోతోంది అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి మళ్లీ దిగే పరిస్థితి  ఉంది అంటున్నారు. ఒకవేళ ఆయన కాదంటే బండారు దత్తాత్రేయ కుమార్తెకు చాన్స్ ఉంటుంది అని చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో చేసిన దత్తాత్రేయ పట్ల మోడీ షాలకు మంచి అభిప్రాయం ఉంది. దాంతో ఆమె  టికెట్ కి బీజేపీ ఓకే అనవచ్చు అని అంటున్నారు. సో దత్తన్న వారసురాలు ఎంట్రీ ఖాయమన్న మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.