బల్దియాలో సర్జికల్ స్ట్రైకే అన్నోళ్లకు.. సాగర్ లో డిపాజిట్ గల్లంతు

Tue May 04 2021 06:00:01 GMT+0530 (IST)

BJP loses in Sagar

తెలంగాణలోని దుబ్బాకలో  భారీ విజయం ఆ తర్వాత జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో బీజేపీ విర్రవీగి పోయింది. తెలంగాణ లో ఇక వచ్చేది మేమే అంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. అంతలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ గెలుపు మాదే నంటూ ఆ పార్టీ  నేతలు డంఖా బజాయించారు.అయితే ఆదివారం విడుదలైన ఫలితాలతో ఆ పార్టీకి బొప్పికట్టింది. చాలా చోట్ల ఆ పార్టీ నోటాతో పోటీ  పడుతూ ఓట్లు సాధించింది. అక్కడ బీజేపీ  కేవలం 7676 ఓట్లు మాత్రమే సాధించి ఘోర వైఫల్యం చెందింది.నిన్నటి వరకు తెలంగాణలో మేమింతంటే   మేమింత అని గొప్పలు చెప్పుకున్న కాషాయ పార్టీ నాయకులు ప్రస్తుతం వచ్చిన ఫలితాలతో కిమ్మన కుండా పోయారు.

 నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ కు ఉప ఎన్నిక జరుగగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి   నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బీజేపీ  నుంచి డాక్టర్ రవి నాయక్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నోముల భరత్ 15 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించగా జానారెడ్డి 50వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి రవి నాయక్ కేవలం 7676 ఓట్లు సాధించి డిపాజిట్ కూడా కోల్పోయారు.

సాగర్ లో బీజేపీకి ఎందుకీ దుస్థితి సాగర్ లో ఉప ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల అవగానే బీజేపీ ముందే  ప్రచారం ప్రారంభించింది. అయితే అక్కడ ఆ పార్టీకి బలమైన క్యాండెట్ లేడు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిని పార్టీలోకి లాగేందుకు కమల దళ నాయకులు ప్రయత్నించారు. అయితే జానారెడ్డి అందుకు అంగీకరించకపోవడంతో మరో ఎత్తు వేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ సాగర్ లో పోటీ చేసే అభ్యర్థిని  ప్రకటించిన తర్వాత ఆ పార్టీలోని అసంతృప్తులను తమ వైపునకు లాక్కొని వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావించింది.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా నోముల నర్సింహయ్య కొడుకు భగత్ కే టికెట్ కేటాయించడంతో బీజేపీ ఆశించిన స్థాయిలో అక్కడ అసంతృప్తి జ్వాలలు రగల్లేదు. దీంతో అక్కడ బీజేపీ డాక్టర్ రవి నాయక్ కు టికెట్ ఇచ్చి పోటీలో దింపింది. నోముల నర్సింహయ్య మరణంతో ప్రజల్లో సెంటిమెంటు ఉండగా ఓటర్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు ఓటు వేశారు.  సాగర్లో తనకున్న బలంతో జానారెడ్డి కూడా 50 వేలకు ఓట్లు సాధించారు. ఇక సంస్థాగతంగా ఇక్కడ పార్టీ నిర్మాణం లేని బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక బొక్కాబోర్లా పడింది.