ఏపీ రాజకీయాలపై బీజేపీ చలిమంట కాగుతోందా..!

Tue Nov 23 2021 13:00:01 GMT+0530 (IST)

BJP leaders orders on AP politics

``మీరు మాట్లాడొద్దు. కనీసం ఒక్క కామెంట్ కూడా చేయొద్దు..! వాళ్లు వాళ్లు కొట్టుకోనీయండి. మనకు ఏదైనా.. ప్లస్ అవుతుందేమో చూడండి!`` ఇదీ.. ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి కేంద్రంలోని బీజేపీ జాతీయ సారథి.. జేపీ నడ్డా చేసిన సూచన. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.`శుక్రవారం అసెంబ్లీ` ఘటన రాష్ట్రంలోనే కాదు.. చంద్రబాబు పెట్టిన కన్నీటి కథ.. ఢిల్లీ వరకు పాకింది. దీంతో ఈవిషయం జాతీయ మీడియాలోనూ.. ఫస్ట్ పేజీల్లో వచ్చింది. దీనిపై ఉప్పందుకు బీజేపీ జాతీయ సారథి.. అసలు ఏపీలో ఏం జరిగిందనే విషయాన్ని ఆరాతీశారు.

ఈ క్రమంలో రాష్ట్ర నేతలు ఇక్కడ ఏం జరిగిందో వివరించారట. తన భార్యను వైసీపీ నాయకులు దూషించారని.. అందుకే చంద్రబాబు శపథం చేసి బయటకు వచ్చారని.. చెప్పారట. అంతేకాదు.. సాటి రాజకీయ పార్టీగా.. సాటి నాయకుడిగా..చంద్రబాబుకు మద్దతుగా ఏదైనా చేయాలని అనుకుంటున్నాం అని వ్యాఖ్యా నించారట. కనీసం ఖండన అయినా.. ఇద్దామని.. లేకపోతే.. ప్రజల్లో చులకన అయిపోతామని కూడా మొరపెట్టుకున్నారట.

ఎందుకంటే.. రాష్ట్రం మొత్తం మహిళా సెంటిమెంటుపై ఆధారపడి రాజకీయాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే నందమూరి .. కుటుంబానికి చెందిన మహిళ విషయంలో అన్ని పార్టీలూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నాయని తెలిపారట. అయితే.. ఢిల్లీ పెద్ద మాత్రం.. నోరు మూసుకుని ఉండాల్సిందే! అని గట్టిగా చెప్పారట.

ఇప్పుడు ఎటూ ఎవరూ మాట్లాడొద్దని.. ఏం జరుగుతుందో చూడాలని సూచించారట. ``ముందు ఆ రెండు పార్టీలను జుట్టు జుట్టు పట్టుకోనివ్వండి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజలు నిజంగానే ఈ ఘటనను నమ్ముతుంటే.. టీడీపీకి అనుకూలంగా మాట్లాడండి.లేక.. ప్రజలు విశ్వసించకపోతే.. అప్పుడు మరో స్టాండ్ తీసుకోండి. అంతేతప్ప.. ఇప్పుటికిప్పుడు ఎలాంటి కామెంట్లు చేయొద్దని సూచించారట.

ఇప్పటికిప్పుడు కనుక కామెంట్లు చేస్తే.. మనకు సానుభూతి పెరగకపోగా.. మరింత నష్టం తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారట. సో.. ఇదీ బీజేపీ సంగతి. అంటే.. ఊరంతా తగలబడుతున్నా.. తనకు మాత్రం చలిమంట బాగుందనే రకంగా.. వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తుండడం గమనార్హం.