చంద్రబాబు కేసులపై ఢిల్లీలో చర్చ..?!

Tue Feb 12 2019 12:04:15 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బాగానే హంగామా చేశాడు. మోడీ వ్యతిరేకులందరినీ పిలిపించి మోడీని తిట్టించాడు. వాళ్లంతా మోడీని తిట్టడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు.. అలాంటి వాళ్లకు బాబు అవకాశం కల్పించాడు.ఇది బీజేపీ నేతలకు పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. ఇన్ని రోజులూ తమ అధికారం పంచుకుని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులూ చంద్రబాబు నాయుడు హోదా వద్దు అనే అన్నాడు. హోదాతో ఏమీ రాదు అన్నాడు. బీజేపీ వాళ్లు హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదని… అంతకు మించిన ప్యాకేజీని రాష్ట్రానికి ఇచ్చినట్టుగా బాబు చెప్పుకొచ్చాడు.

హోదాకు మించి సాధించినట్టుగా చెప్పుకున్నాడు. కేంద్రం బాగా సాయం చేస్తోందని ఏపీ అసెంబ్లీలో తీర్మానం సైతం ప్రవేశ పెట్టాడు. మోడీ భజన ఒక రేంజ్ లో చేశాడు చంద్రబాబు నాయుడు. మళ్లీ మోడీ ప్రధాని కావాలంటూ ఎన్డీయే మీటింగులో తీర్మానం సైతం పెట్టాడు. ఇదీ చంద్రబాబు నాయుడు అప్పుడు వ్యవహరించిన తీరు.

ఇప్పుడు మాత్రం హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని అంటున్నాడు. అప్పుడు హోదా విషయంలో తను మాట్లాడిన తీరును అంతా మరిచిపోయి ఉంటారనేది చంద్రబాబు నాయుడి లెక్క. అందుకే ఇప్పుడు బీజేపీని విలన్ గా చూపి.. పబ్బం గడుపుకోవాలని బాబు భావిస్తున్నాడు.

అయితే బాబు ట్రాక్ రికార్డులో కేవలం అబద్ధాలే కాదు.. భారీ అవినీతి - కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు కేసుల్లో ఇప్పుడు కదలిక ఉండవచ్చని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక అనేక అవినీతి వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు పేరు - ఆయన తనయుడు లోకేష్ పేరు వినిపిస్తూ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ వాళ్లను మరింతగా రెచ్చగొట్టినట్టుగా ఉందని..ఇదే ఊపులో చంద్రబాబు నాయుడు మీద కేసుల్లో కదలిక ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తుంది. ఒకవేళ ఎన్నికల వేళ కేసులతో చంద్రబాబు నాయుడును కదిలిస్తే ఆయనకు సానుభూతి వస్తుందని అనుకునే పక్షంలో ఢిల్లీ వాళ్లు కామ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.