Begin typing your search above and press return to search.

ఛార్జ్ షీట్ తో కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేసిన బీజేపీ

By:  Tupaki Desk   |   22 Nov 2020 5:30 PM GMT
ఛార్జ్ షీట్ తో కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేసిన బీజేపీ
X
దుబ్బాక గెలుపు గాలివాటం ఎంత మాత్రం కాదన్న విషయాన్ని తెలియజేస్తూ.. గ్రేటర్ లో తమ బలాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతున్నారు కమలనాథులు. అందుకు తగ్గట్లే వారు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ‘‘ఛార్జ్ షీట్’’ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్.. ఎంఐఎం వైఫల్యం పేరుతో ఒక బుక్ లెట్ ను విడుదల చేశారు. విశ్వ నగరాన్ని నిర్మించే ప్రయత్నంలో ఇప్పటికే తాము సక్సెస్ అయినట్లుగా చెప్పుకుంటున్న గులాబీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా వారి తాజా ఛార్జ్ షీట్ ఉండటం గమనార్హం.

హైదరాబాద్ మహానగరానికి గడిచిన ఐదేళ్లలో రూ.67 వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్న వేళ.. ఆ ఖర్చుకు సంబంధించిన లెక్క ఉందా? అని ప్రశ్నించింది. రూ.67వేల ఖర్చును ఎక్కడ? ఏ బస్తీలో ఎంత ఖర్చు చేశారని ప్రశ్నిస్తున్నారు. లక్ష బెడ్రూం ఇళ్లంటే 1100 ఇళ్లను మాత్రం లబ్థిదారులకు ఇచ్చారని.. మిగిలిన వాటి మాటేమిటి? అన్న ప్రశ్నతో పాటు.. 2015లో జీతాలు పెంచాలని 20వేల మంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల్ని ప్రగతి భవన్ కు పిలిపించిన సీఎం కేసీఆర్.. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తామన్న హామీ ఏమైంది సార్? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ ను డల్లాస్.. ఇస్తాంబుల్ చేస్తామన్న కేసీఆర్.. భారీ వర్షాల వేళ.. పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితిని గుర్తు చేస్తూ.. దానికి సంబంధించిన ఫోటోల్ని ప్రదర్శించారు. డల్లాస్ లో వరదలొచ్చినా కాలనీలు.. జనం కొట్టుకుపోకుండా మౌలిక వసతులు ఉంటాయని తెలీదా? అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము గెలిస్తే.. వంద రోజుల్లో నగర రూపురేఖల్ని మారుస్తామని కేటీఆర్ 2016 ఎన్నికల్లో గప్పాలు చెప్పారని.. ఆ ప్లాన్ ఏమైందని ప్రశ్నించారు.

మూసీ కంపు పోవాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలని చెప్పారని.. మరి మూసీ రివర్ ఫ్రంట్ అందాలేవన్న ప్రశ్నతో పాటు.. 2016లో వచ్చిన వరదల వేళలో నిజాంపేటలోని బండారీ లేఔట్ లో ఇళ్లు మునిగాయని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ఆక్రమణల్ని తొలగిస్తామన్న మాట ఎంతవరకు వచ్చిందని నిలదీశారు. వరద పరిహారం కింద ఇంటింటికి రూ.10వేలు ఎవరి జేబులోకి వెళ్లాయని ఆరోపిస్తూ.. సరిగ్గా ఎన్నికలకు ముందు రూ.650 కోట్ల ప్రజాధనాన్ని టీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు జేబులు నింపుకున్నారని మండిపడ్డారు.

ఆస్తిపన్నుపై నజరానా.. నగర రోడ్లతో పాటు.. ట్రాఫిక్ ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా పేర్కొన్నారు. కంపు కొట్టే హుస్సేన్ సాగర్ లోని నీళ్లను తోడి.. మంచినీళ్లతో నింపుతామని చెప్పారని.. సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లుగా చేస్తామన్నసీఎం మాట ఏమైందని ప్రశ్నించారు.మైట్రో రైలు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని.. పాతబస్తీ వరకు ఎందుకు వెళ్లలేదన్న సూటి ప్రశ్నను సంధించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 60 నుంచి 100 అడుగుల ఎత్తైన భారీ లేక్ వ్యూ టవర్స్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. ఆరేళ్లు అయినా ఇంతవరకు ప్రపోజల్ స్థాయిని దాటలేదన్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం 400 ఏళ్ల నగర చరిత్రకు సాక్షిగా ఉన్న కట్టడాల్ని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచశ్రేణి నగరమంటే ఉన్న చరిత్రను నేలమట్టం చేయటమేనా? అ శిథిలాల మీద ఆధునాతన హంగులతో బిల్డింగులు కట్టుకోవటమేనా? అని ప్రశ్నించారు. నల్లా కనెక్షన్.. యువతకు ఉద్యోగాలు.. గ్రేటర్ కు తరచూ అప్పులు తీసుకురావటమేనా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాల్ని కళ్లకు కట్టేలా.. సింఫుల్ గా చెప్పేసిన తాజా ఛార్జిషీట్ గులాబీ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పక తప్పదు.