Begin typing your search above and press return to search.

ప్ర‌క‌ట‌నల కోసం.. కోట్లు ఖ‌ర్చు చేస్తున్న బీజేపీ.. నిజం!

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:24 AM GMT
ప్ర‌క‌ట‌నల కోసం.. కోట్లు ఖ‌ర్చు చేస్తున్న బీజేపీ.. నిజం!
X
స‌హ‌జంగా ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. పార్టీలు ఖ‌ర్చు చేస్తాయి. వివిధ రూపాల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తాయి. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న ఖ‌ర్చులో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ అన్ని పార్టీల‌నూ ప‌క్క‌కు నెట్టేసింది. తాజాగా ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన జాబితాలో బీజేపీ తొలిస్థానంలో నిలిచింది. ఈ పార్టీ ఏకంగా కేవ‌లం ప్ర‌చారం కోస‌మే రూ.300 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఇక‌, త‌ర్వాత వ‌రుస‌లో మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ నిలిచింది. అయితే, వివ‌రాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇక‌, ప్రాంతీయ పార్టీలూ మేమెందుకు త‌గ్గాల‌నే రీతిలో కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నాయ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

ఏయే పార్టీ ఎంతెంతంటే..

2021-22 సంవత్సరానికి సంబంధించి రాజకీయపార్టీలు పంపిన వార్షిక నివేదికల ఆధారంగా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా ఖర్చుల‌ వివరాలను విడుదల చేసింది. కాంగ్రెస్, సీపీఎమ్లు ఖర్చుల లెక్కలు సమర్పించలేదని.. ఎన్సీపీ, సీపీఐసహా మరికొన్ని పార్టీలు ప్రకటనలు, ప్రచారానికి పైసా ఖర్చు చేయలేదని ఎన్నిక‌ల సంఘం వివ‌రించింది.

బీజేపీ
2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ప్రకటనలు, ప్రచారానికి రూ. 313.17 కోట్లు ఖర్చు చేసింది. అందులో 75శాతం ఎన్నికలు, సాధారణ ప్రచారానికి వెచ్చించినట్లు పేర్కొంది. అదేవిధంగా ప్రకటనల కోసం రూ. 164 కోట్లు, ఆడియో, వీడియోల కోసం రూ. 18.41 కోట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాకోసం రూ. 72.28కోట్లు ఖర్చు చేసింది. కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లకు మరో రూ. 36.33 కోట్లు, కరపత్రాల కోసం రూ. రూ. 22.12 కోట్లు వెచ్చించినట్లు ఈసీ పేర్కొంది.

డీఎంకే
తమిళనాడులోని అధికార పార్టీ డీఎమ్కే.. ప్రకటనలు, ప్రచారానికి కోసం రూ. 35.40 కోట్లు వ్యయం చేసింది. ఇది ఆ పార్టీ మెుత్తం ఖర్చులో 97శాతమని ఈసీ పేర్కొంది.

అన్నాడీఎంకే
త‌మిళ‌నాడు ప్ర‌ధాన‌ ప్రతిపక్షం అన్నాడీఎంకే ప్రకటనల కోసం రూ. 28.43 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఆ పార్టీ మెుత్తం ఖర్చులో 78శాతం.

ఆప్‌
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌).. 2021-22లో ప్రకటనలు, ప్రచారానికి రూ. 30.29 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ ఖర్చులో.. అది 46 శాతం.

టీఎంసీ
బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్.. ప్రకటనలు, ప్రచారం కోసం రూ. 28.95 కోట్లు ఖర్చు పెట్టింది.

బీఎస్‌పీ
యూపీ మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ రూ. 13.83కోట్లు ఖ‌ర్చు చేసింది.

బీజేడీ
ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజేడీ రూ.16 కోట్లు ప్రకటనలు, ప్రచారం కోసం ఖ‌ర్చు చేసింది.

ఎస్పీ
యూపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) రూ. 7.56 కోట్లు ఖ‌ర్చు చేసింది.

జేడీయూ
బీహార్ సీఎం నితీశ్‌ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న జేడీయూ రూ. 36.82 లక్షలు వెచ్చించింది.

ఆర్‌జేడీ
బిహార్ అధికార ప‌క్షం, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ రూ. 33 వేలు ఖర్చు చేసినట్లు ఈసీ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఇదీ..

బీఆర్ ఎస్‌
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌ రూ. 7.12 కోట్లు చేసింది.

టీడీపీ
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రూ. 1.66 కోట్లు ప్రచారం, ప్రకటనల కోసం వెచ్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

వైసీపీ
ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికల ప్రకారం ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రకటనలు, ప్రచారానికి ఖర్చు చేయలేదు.