Begin typing your search above and press return to search.

బీజీపీ ఆయాసం : కేసీయార్ కోసమేనా...?

By:  Tupaki Desk   |   2 July 2022 3:30 PM GMT
బీజీపీ ఆయాసం : కేసీయార్ కోసమేనా...?
X
లేని చోట ఎంత వెతుక్కున్నా దొరికేది పెద్దగా ఉండదు. తెలంగాణా రాజకీయ మైదానంలో బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇపుడు. చూస్తే 2018 ఎన్నికల్లో ఆ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్ చేసింది. బలమైన నాయకులు లేరు, మొత్తం 119 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్ధులు ఉన్నారా అన్నది ఒక డౌట్. ఇక బీజేపీ పువ్వు గుర్తు ఎంతమందికి తెలుసు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. అయినా సరే అత్యాశ అనాలో రాజకీయ ఆకాంక్షగా చూడాలో తెలియదు కానీ బీజేపీ యమ జోరు చేస్తోంది.

తెలంగాణా నాది అంటోంది. నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణాలో నా వాటా అధికారమే అని జబ్బలు చరుస్తోంది. దానికి తగిన రాజకీయ ప్రాతిపదిక ఉందా అన్నది కూడా చూడకుండా తెగ ఆరాటపడుతోంది. నిజంగే రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ దానికి పార్టీ కంటే వ్యక్తుల ప్రాబల్యం, స్థానిక పరిస్థితులు కూడా అతి ముఖ్య కారణాలుగా ఆ పార్టీ ఎందుకు విశ్లేషించుకోవడంలేదు అన్నది ఒక ప్రశ్న.

ఇక హైదరాబాద్ కి జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ బాగానే సీట్లను సాధించింది. దానికి కారణం కూడా సింపుల్. భాగ్యనగరంలో బీజేపీకి బలం మొదటి నుంచి ఉంది. అర్బన్ ఏరియాలో ఆ పార్టీ సానుభూతిపరులు ఉన్నారు.

ఇక బీజేపీకి తెలంగాణా రాజకీయ మైదానంలో ఎంతవరకూ స్పేస్ ఉంది అని ఆలోచిస్తే కొన్ని చేదు నిజాలు చెప్పుకోకతప్పదు. 2014, 2018 ఎన్నికల్లో టీయారెస్ ని ఢీ కొట్టింది కాంగ్రెస్ కానీ బీజేపీ కాదు, రెండవ స్థానంలో ఉన్నది కాంగ్రెస్. ఆ పార్టీ జెండా వాడవడలా అందరికీ తెలుసు. ప్రతీ బూత్ లో ఎన్నో కొన్ని సీట్లు కాంగ్రెస్ కి ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల అనైక్యత, సరైన వ్యూహాలు లేని కారణంగా ఓటమి సంభవిస్తే సంభవించవచ్చు కాక కానీ కాంగ్రెస్ తెలంగాణాలో లేదని అనుకుంటే అది భ్రమగానే చూడాలి.

ఇక టీయారెస్ గురించి చెప్పుకోవాలి. ఆ పార్టీకి కొండంత బలం కేసీయార్. ఆయన ఒక్కడు చాలు, నాలుగు కోట్ల జనాలను ఏదో విధంగా తన వైపునకు తిప్పుకునేందుకు. కేసీయార్ ఎన్నిక ఎన్నికకూ ఒక కొత్త నినాదం అందుకుంటారు. ఈసారి ఆయన కమలం పార్టీని బూచిగా చూపిస్తున్నారు. నిజానికి ఏమీ లేని చోట బీజేపీని దువ్వడం ద్వారా రెచ్చగొట్టడం ద్వారా కేసీయార్ మైండ్ గేమ్ ఆడారు. ఓట్ల చీలిక కోసమే ఈ రాజకీయ పాచిక. అయితే దానిలో చిక్కుకున్న బీజేపీ లేని బలాన్ని ఊహించుకుంటూ ఈ రోజు యావత్తు జాతీయ పార్టీయే హైదరాబాద్ కి తరలివచ్చింది.

ఎంతమంది నేతలు వచ్చినా వారంతా ఇతర రాష్ట్రాల వారే. లోకల్ గా కేసీయార్ కి ధీటుగా పక్కాగా నిలబడి పోరాడే బిగ్ ఫిగర్ బీజేపీలో ఉన్నారా అన్నదే ప్రశ్న. ఒకనాడు ఆలె నరేంద్ర, బద్ధం బాలిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగరరావు వంటి నాయకులు బీజేపీకి గట్టి పిండాలుగా ఉండేవారు. వారు జనాలలో ఉంటూ పార్టీకి బలంగా ఉండేవారు.

ఇపుడు పార్టీ బలంతో జనాలలోకి నేతలు వస్తున్నారు. అంటే సీన్ రివర్స్ అన్న మాట. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మూడేళ్ళుగా ఉన్నా తెలంగాణాలో బీజేపీని ఎంతవరకూ పటిష్టం చేశారు అన్నది కూడా ఆలోచించాలి. ఇక బండి సంజయ్ తీరు చూస్తే మాట దూకుడే ఎక్కువ అన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీకి కేసీయార్ ని ఢీ కొట్టే లీడర్ ఉండాలి. ఆ నాయకుడు యావత్తు తెలంగాణా సమాజాన్ని ఉర్రూతలూపాలి.

అపుడు మోడీ వచ్చినా అమిత్ షా మంత్రాంగం వేసిన బొమ్మ హిట్ అవుతుంది. అలా కాకుండా అంతా తామే అని కేంద్ర నాయకత్వం దిగి వస్తే మూడు రోజులు మకాం చేసి టీయారీస్ విమర్శిస్తే కధ విజయవంతం అవుతుందా అన్నదే బిగ్ డౌట్. ఇంతకు వందింతలు ఊపు ఉన్న పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎందుకు గెలవలేదు అంటే అక్కడ మమతా బెనర్జీకి ధీటైన నాయకత్వాన్ని లోకల్ గా బీజేపీ చూపించలేకపోయింది. మోడీ షాలు ఎన్ని సార్లు టూర్లు చేసినా వారు సీఎం అభ్యర్ధి కారు కదా. అలా మమత పై చేయి సాధించింది.

సేమ్ సీన్ రిపీట్ అన్నట్లుగా తెలంగాణాలో కూడా బీజేపీ సకుటుంబ సపరివార సమేతంగా వస్తోంది. కేటీయార్ మాటలలో చెప్పాలీ అంటే పొలిటికల్ టూర్ గానే దీన్ని చూస్తున్నారు అనుకోవాలి. ఇక ఇంతటి ఆర్భాటం, ఆయాసం బీజేపీ పడితే జనాల్లో ఎంతో కొంత శాతం ఓట్లు పెరుగుతాయి. అవి కాస్తా వెళ్ళి కాంగ్రెస్ ఓట్లను చీలుస్తాయి. చివరికి గెలిచేది నిలిచేది ముచ్చటగా మూడవసారి కేసీయార్.

అందుకే టీయారెస్ శిబిరం కమల కుతూహలాన్ని చూసి లోలోపల సంబరాలు చేసుకుంటూనే బయట మాత్రం విమర్శలు గట్టిగా దట్టిస్తోంది. కేంద్ర బీజేపీ ఎంత బలంగా తెలంగాణాలో తాకిడి చేస్తే అంతకంతగా టీయారెస్ గెలుపు అవకాశాలు పెరుగుతాయి అన్న గులాబీ శిబిరం అంచనాలే చివరకు నిజమయేట్లుగా ఉన్నాయనుకోవాలేమో.