మరో కులానికి గాలమేసిన బీజేపీ!

Tue Sep 14 2021 17:17:54 GMT+0530 (IST)

BJP blows the whistle on another caste

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి కుల సమీకరణాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో లింగాయత్ ల గీత దాటలేదు. యడియూరప్పను దించేసినా లింగాయత్ వర్గానికే చెందిన బొమ్మైని సీఎంగా చేశారు. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో జైన్ సీఎంను దించేసి హఠాత్ గా పట్టిదార్ ను సీఎంగా చేశారు. పద్నాలుగు శాతం జనాభా ఉన్న పట్టిదార్ సామాజికవర్గానికే చెందిన వ్యక్తికి పగ్గాలప్పించారు. ఇంకా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ కుల సమీకరణాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే యూపీలో ఒక యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.వెస్ట్ యూపీలోని అలిఘర్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు మోడీ. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఉత్తరాదిన జాట్ ప్రముఖుల్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ కు చాలా పేరుంది. స్వతంత్రానంత రాజకీయాల్లో కూడా ఆయన పాలు పంచుకున్నారు. అలిఘర్ లోని యూనివర్సిటీ కి భూదాత కూడా ఆయనే. రాజకీయంగా కూడా పలు విజయాలు సాధించారు. అయితే రాజకీయంగా ఆయన పేరు మరుగున పడిపోయింది.

ఇప్పుడు ఆయన పేరును బీజేపీ తెర మీదకు తీసుకు వచ్చింది. ఆయన పేరుతో స్టేట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. సరిగ్గా యూపీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు చేస్తున్న సమయంలో.. ఈ శంకుస్థాపన జరగడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ శంకుస్థాపనతో బీజేపీ రాజకీయ ఎత్తుగడ వేసిందనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకించి జాట్ లను ఆకట్టుకోవడానికే ఆ సామాజికవర్గ ప్రముఖుడు అయిన ప్రతాప్ సింగ్ పేరుతో వర్సిటీకి శంకుస్థౄపన చేసిందనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది.

2014 నుంచి జాట్ లు బీజేపీకి సానుకూలంగా ఉంటున్నారు. అయితే క్రమేణా ఆ ఊపు తగ్గింది. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా జాట్ లు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదనే విశ్లేషణలు వినిపించాయి. ఆ లోటును భర్తీ చేయడానికి ఇప్పుడు  ఈ వర్సిటీ పేరును బీజేపీ ఉపయోగించుకుంటోందని స్వయంగా మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని యూపీ ఎన్నికల నేపథ్యంలో... మరో కులానికి ఇలా బీజేపీ గాలమేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయిప్పుడు.