Begin typing your search above and press return to search.

బీజేపీకి ఏపీలో నెక్ట్స్ టార్గెట్ అదేనా?

By:  Tupaki Desk   |   20 July 2019 4:38 AM GMT
బీజేపీకి ఏపీలో నెక్ట్స్ టార్గెట్ అదేనా?
X
ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుందామంటే వారిపై అనర్హత వేటు కచ్చితంగా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫిరాయింపులను ఎంకరేజ్ చేసేది లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తన పార్టీలోకే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిగ్నల్స్ ఇస్తున్నా జగన్ వారికి అవకాశం ఇవ్వడం లేదు.

అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరితే వారిపై అనర్హత వేటు తప్పకపోవచ్చు. అయితే బీజేపీకి ఉన్న మార్గం విలీనం. కానీ అంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఆ సంగతలా ఉంటే.. ఏపీలో ఎమ్మెల్సీల మీద కన్నేసిందట భారతీయ జనతా పార్టీ. అది తెలుగుదేశం ఎమ్మెల్సీల మీదే!

తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తామని ప్రతిపాదనలు పంపుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. త్వరలోనే వారిని చేర్చుకునే అవకాశాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అయితే మండలి చైర్మన్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన తెలుగుదేశం వ్యక్తే. కాబట్టి బీజేపీ సాహసం చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఎవరైనా నేతలు బీజేపీలోకి ఫిరాయించినా తెలుగుదేశం గట్టిగా స్పందించకపోవడం కూడా గమనార్హం.

రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దగా హడావుడి కూడా చేయలేదు. వెళ్లిపోతే వెళ్లిపోయారులే అన్నట్టుగా కామ్ అయిపోయింది టీడీపీ. వారిని చంద్రబాబు నాయుడే పంపించారనే వాదన ఉండనే ఉన్న సంగతీ తెలిసిందే.