`సాగు` సరే.. మోడీకి సెగపెడుతున్న మద్దతు.. పార్లమెంటులో కుస్తీనా? కత్తి యుద్ధమా?

Mon Nov 29 2021 07:00:01 GMT+0530 (IST)

BJP Situation In Parliament

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. సోమవారం నుంచి ఈ సమావేశాలు షురూ కానున్నాయి. అయితే.. ఇప్పుడు ప్రదాని మోడీ ముందు.. కీలకమైన అంశాలు వచ్చి చేరాయి. నిన్నటి వరకు.. మూడు సాగు చట్టాలు  ఉండగా.. ఇప్పుడు.. నిన్న మొన్నటి వరకు అసలు ఊసులో లేని.. పంటలకు మద్దతు ధర అంశం వచ్చి చేరింది. దీంతో ప్రతిపక్షాలు.. ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని.. మోడీ సర్కారుపై యుద్ధానికి రెడీ అయ్యాయి. అదేసమయంలో సాగుచట్టాలను వెనక్కి తీసుకున్న దరిమిలా.. ప్రభుత్వ సమర్ధతను కూడా ప్రతిపక్ష నేతలు.. ఉభయ సభల్లో కార్నర్ చేయడం ఖచ్చితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పంటలకు మద్దతు ధర(ఎంఎస్పీ)పై చట్టబద్ధత కల్పించే విషయమై.. మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టాలనేది.. విపక్షాల వ్యూహంగా స్పష్టమైంది. కనీస మద్దతు ధరపై చర్చ జరపాల్సిందేననే డిమాండ్‌ను వినిపించడంతోపాటు.. రైతుల పక్షాన గళం వినిపించనున్నాయి. దీంతో పాటు సాగు చట్టాల ఉద్యమంలో అమరులైన రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయనుంది. అదేసమయంలో కొన్నాళ్లు తీవ్ర వివాదంగా ఉన్న పెగసస్ వ్యవహారం ద్రవ్యోల్బణం నిరుద్యోగం చైనా చొరబాట్లపై సభలో విపక్షాలు సంధించే ప్రశ్నలకు మోడీ సర్కారు.. కుస్తీ పడుతుందా?  లేక.. కత్తి యుద్ధం చేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

అదేసమయంలో  బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తమవు తోంది. ఈ నిర్నయాన్ని వ్యతిరేకిస్తూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఇటీవల అసెంబ్లీలోనూ తీర్మానం చేసింది. అంతేకాదు.. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని కోరుతూ.. నేరుగా బెంగాల్ సీఎం మమత.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం మౌనంగా ఉంది. సో.. బెంగాల్ ఎంపీలు.. పార్లమెంటులో ఈ విషయా్న్ని ప్రస్తావించడం ఖాయంగా కనిపిస్తోంది. అదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో రైతుల ఉద్యమంపైకి కేంద్ర మంత్రి కుమారుడు.. కారును పోనిచ్చి 8 మంది మరణానికి కారణమైన నేపథ్యంలో మంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. తాజాగా ప్రారంభం అవుతున్న సమావేశాల్లో ఈ విషయం కూడా రగులుకునే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.