ఓటుకు ఆరు వేలిస్తా.. నాకే ఓటేయండి: బీజేపీ నేత ప్రజలకు తాయిలం

Wed Jan 25 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

BJP Ramesh Jarkiholi comments 6k to each vote

ఒకవైపు బీజేపీ ఉచితాలకు తాము వ్యతిరేకమని.. ఉచితాలు అనుచితాలను ప్రజలను మొద్దులు చేయడ మేనని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. కానీ ఆ పార్టీకే చెందిన నాయకులు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. మరో మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బీజేపీ నేతలు అప్పుడే ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రమేష్ జార్కి హోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.నాకు ఓటేస్తే.. ఓటుకు ఆరు వేలిస్తా! అని ఆయన ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం వివాదానికి దారితీసింది. గత ఎన్నికల్లో రమేష్.. సుళేబావి నియోజకవర్గంలో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాల్కర్‌పై ఓడిపోయారు. ఇకఅప్పట్లో ఆమె.. ఓటర్లకు తాయిలాలు పంచిందని.. రమేష్ తరచుగా ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ కూడా కావడంతో ఆ ఆరోపణలను మరింత పెంచారు.

``లక్ష్మి అప్పట్లో మీకు తాయిలాలు పంచింది. దాని విలువ మహా అయితే.. 3000 ఉంటుంది. కానీ నేను ఏకంగా ఆరు వేలు ఇస్తా. అంటే డబుల్ ధమాకా!  మీ ఓటు నాకే వేయండి`` అని అంతర్గత సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈవీడియో స్థానికంగా రాజకీయ మంటలు రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే.. గ్రామాలలో కుక్కర్లు మిక్సర్లు పంచి పెట్టారని రమేష్ విమర్శించారు.

'ఒక మిక్సర్ ధర రూ.600 నుంచి రూ.700 ఉండవచ్చు. అలాగే మరికొన్ని వస్తువులు కూడా ఇచ్చారు. వస్తువుల ధరలన్నీ కలిపితే మూడు వేల రూపాయలు కావొచ్చు. ఓటుకు రూ.మూడు వేలు ఇచ్చి ఆమె గెలిచారు. మేము ఓటుకు రూ.6000 ఇస్తాం.. మాకు ఓటు వేయండి' అని సభలో మాట్లాడారు. అదేసమయంలో తాను ఆరు ఎన్నికల్లో గెలిచానని కానీ ఏ ఎన్నికలోనూ డబ్బులు వస్తువులు పంచలేదని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గ ప్రజలే తనకు డబ్బులిచ్చి గెలిపించారని జార్కిహోళి అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.