Begin typing your search above and press return to search.

వైసీపీని కూడా వదలరంట... దాడులతో బీజేపీ చెలగాటం

By:  Tupaki Desk   |   6 Dec 2022 11:30 AM GMT
వైసీపీని కూడా వదలరంట... దాడులతో బీజేపీ చెలగాటం
X
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రాజకీయ చెలగాటం మొదలెట్టేసింది. ఒక రాష్ట్రంతోఎందుకు రెండు చోట్లా ఒక్కటే ఆపరేషన్ చేస్తే పోలా అని భావిస్తోంది. ఎటూ ఈ మధ్య దాకా ఒక్కటే రాష్ట్రంగా ఉన్నాయి. పైగా వారూ వీరూ వేరు కాదు. దాంతో తీగ డొంకా అన్నీ కూడా ఒక్కటే. కదిలించి చూస్తే కదన కుతూహలమే. రాజకీయ హాలాహలమే అనుకుంటూ బీజేపీ తెలంగాణా పక్కన ఏపీని చేర్చేసింది.

నిజానికి ఈ మధ్య దాకా బీజేపీ పెద్దల ఊసులో ఏపీ లేదు, టీయారెస్ మీదనే చూపు అంతా ఉంది. కేసీయార్ ఎదురుతిరుగుతున్నారని అక్కడే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంది. కానీ ఏపీలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూండడం, అదే టైం లో పవన్ కళ్యాణ్ తో దోస్తీ ఆయనకు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఇవన్నీ కలసి కొత్త ఆశలను రేపుతున్నాయట.

అందుకే తెలంగాణాలో జరుపుతున్న ఐటీ ఈడీ దాడులలో ఏమైనా లింకులు దొరికితే నేరుగా ఏపీకి వచ్చేస్తున్నారు. అలా ఏపీలో ఇపుడు ఇద్దరు వైసీపీ కీలక నేతల ఇళ్ళలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఒకరు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే మరొకరు పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువ నేత దేవినేని అవినాష్. ఈ ఇద్దరు నేతల ఇళ్ళలో పొద్దు పొద్దునే ఐటీ అధికారులు వచ్చి సోదాలు చేయడం మొదలెట్టారు.

నిన్నటికి నిన్న ఢిల్లీలో ప్రధాని మోడీ చేతిలో చేయి వేసి షేక్ హ్యాండ్ అందుకున్న జగన్ విమానం దిగి విజయవాడ వచ్చేలోగానే వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయంటే ఎక్కడైనా తమ్ముడే కానీ పేకాటలో కానే కాదు అని, మోడీతో అలాగే ఉంటదని, ఇక వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, ఇసుక, మద్యం వ్యాపారాలు చేస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా సొంతం చేసుకుని పనులు చేస్తున్నారు. దాంతో వారి వద్ద లెక్కలు మిక్కిలి ఆదాయం లెక్క చెప్పనిది ఉంటుందని అలాగే పన్నులను కూడా భారీగా వారు ఎగవేత వేస్తారని భావించే ఈ దాడులకు ఐటీ శాఖ దిగింది అని అంటున్నారు.

ఇక ఈ మధ్యనే చూసుకుంటే వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని లిక్కర్ స్కాం లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ఇపుడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే కేసులో తెలంగాణా సీఎం కేసీయార్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా కీలక సూత్రధారులు అని సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది అంటున్నారు

ప్రస్తుతానికి కవితకు నోటీసులు ఇచ్చిన సీబీఐ తొందరలోనే వైసీపీ ఎంపీ మంగుంటకు కూడా నోటీసులు ఇస్తారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ నేతలలో వణుకు స్టార్ట్ అవుతోంది అంటున్నారు. నిజానికి వైఎస్ జగన్ కానీ విజయసాయిరెడ్డి కానీ మోడీతో చాలా బాగా ఉంటారు. విధేయత చూపిస్తారు కానీ తన దగ్గర ఎవరూ వేరు కాదు ఎక్కువ కానే కాదు అన్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ స్వేచ్చ ఇచ్చి మరీ పంపిస్తున్నారా అన్నదే చర్చగా ఉందిట.

టీయారెస్ నేతలు అయితే మోడీ మీద గట్టిగా మాట్లాడుతున్నారు. మరి వైసీపీ నేతలు సైలెంట్ గానే ఉన్నారు కదా ఎందుకు ఈ దాడులు అంటే అక్కడే ఉంది మ్యాటర్ అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పూర్తిగా దక్షిణాదిన అందునా రెండు తెలుగు రాష్ట్రాల మీద గురి పెట్టిన బీజేపీ అందరి లెక్కలు తేల్చే పనిలో పడింది అంటున్నారు.

ఒకసారి రాజకీయాల్లో కీలక నాయకులుగా ఉన్న తరువాత ఎవరూ సుద్ధ పూసలు కానే కారు. దాంతో ఎక్కడో లోటుపాట్లు ఉంటాయి. అందువల్ల వాటిని పట్టుకుని తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్న కేంద్ర పెద్దలు ఏపీలో కూడా కొంతమంది వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకున్నారు అని అంటున్నారు. వీరిని నయానో భయానో దారికి తెచ్చుకుని బీజేపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అంటే మెల్లగా ఏపీలో బీజేపీ మార్క్ పాలిటిక్స్ ఎంటరైపోయింది. సో వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైనట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.