Begin typing your search above and press return to search.

పవార్‌ కు అత్యున్నత పదవి..బీజేపీకి అనుకున్న పదవి

By:  Tupaki Desk   |   20 Nov 2019 1:38 PM GMT
పవార్‌ కు అత్యున్నత పదవి..బీజేపీకి అనుకున్న పదవి
X
అత్యాశకు పోయిన శివసేనకు ఉన్నదీ - ఉంచుకున్నదీ రెండూ పోతున్నాయా.. తాము ఏం డిమాండ్ చేసినా బీజేపీ దిగొస్తుందని భావించి సీఎం సీటు కోసం తెగేదాకా లాగిన ఆ పార్టీ ఇప్పుడు సీన్లోంచి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందా అంటే అవుననే అంటున్నాయి మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు.

కాంగ్రెస్‌ తో కలుస్తానంటే బీజేపీ దిగొస్తుందని... బీజేపీని వీడితే కాంగ్రెస్ మద్దతిస్తుందని ఆశించిన శివసేనకు ఆ రెండూ జరక్కపోగా పవార్ కూడా హ్యాండిచ్చి బీజేపీకి షేక్ హ్యాండివ్వడానికి సిద్ధపడుతుండడంతో శివసేన పరిస్థితి దారుణంగా తయారయ్యేలా ఉంది.

బీజేపీతో కలిసి పొత్తులతో పోటీ చేసిన శివసేన ఫలితాలు వెలువడిన తరువాత సీఎం సీటు కావాలని పట్టుపట్టి బీజేపీని వీడింది. బిజెపి కాదంటే ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు ఎగిరి గంతేసి మరీ మద్దతిస్తాయని పగటి కలలు కన్న శివసేన - ఆ రెండు పార్టీలు ఆడిన రాజకీయ చదరంగంలో పావుగా మిగిలే సంకేతాలు కనిపిస్తున్నాయి.

బీజేపీకి దూరమైతే అటు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండలేని పరిస్థితే కాదు కేంద్రంలోనూ ఇప్పుడున్న మంత్రి పదవులు పోతాయి. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా బోనస్‌ గా పార్టీ పుట్టుక నుంచి కాపాడుకుంటూ వస్తున్న హిందూత్వ ఇమేజ్‌ ను ఈ తాజా అధికార దాహం దెబ్బతీసి ఆ పార్టీ మనుగడకే నష్టం తెచ్చేలా ఉంది.

ఇక శివసేనతో కర్ర విరగకుండా పాము చావకుండా రాజకీయం చేసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రస్తుతానికి కింగ్ మేకర్.. భవిష్యత్తులో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయన నిన్న సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు మోదీ పార్లమెంటులో ఎన్సీపీ ఎంపీలను ప్రశంసల్లో ముంచెత్తారు. వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ - ఎన్సీపీల మధ్య స్నేహం చిగురించే సూచనలు కనిపిస్తున్నాయి.

మహారాష్ట్ర రైతు సమస్యల పేరిట ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన శరద్ పవార్‌ కు బిజెపి భారీ ఆఫర్ ఇచ్చినట్లు హస్తిన వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్సీపీ గనక ఎన్డీయే కూటమిలోకి వస్తే.. మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. జాతీయ స్థాయిలో కీలకమైన రాజకీయ పరిణామాలకు నాందీ పలుకుతామని బిజెపి నేతలు శరద్ పవార్‌ కు చెప్పినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్‌ ను ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కూడా బిజెపి రెడీ అవుతున్నట్లు వినిపిస్తోంది.

ఇప్పటికే సీబీఐ కేసులతో సతమతమవుతున్న పవార్ ఫ్యామిలీకి బిజెపి ఇచ్చిన ఆఫర్‌ నక్కతోకను తొక్కినట్లయిందంటున్నారు. కేసుల నుంచి ఉపశమనం లభించడంతోపాటు.. శరద్ పవార్ తనయునికి మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే చాన్స్ వుంది. ఎన్సీపీలో కీలక నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశం కూడా వుంది. అదే సమయంలో ప్రధాని కావాలన్న కోరిక నేరవేర్చుకోలేని శరద్ పవార్ ఫ్యూచర్‌ లో రాష్ట్రపతి అయినా కావొచ్చంటున్నారు.

రాజకీయం చేస్తానంటూ బయలుదేరిన ఉద్ధవ్ పూర్తిగా నష్టపోగా తెలివిగా వ్యవహరిస్తూ వచ్చిన పవార్ లాభపడేలా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఆరితేరిపోయి ములాయం - లాలూ - సోనియా వంటి ఉద్ధండులనే మట్టి కరిపించి.. మమత - చంద్రబాబు - దేవెగౌడ వంటి వారికే ముచ్చెమటలు పట్టించిన షా-మోదీ ద్వయం ముందు ఉద్ధవ్ నిలబడడం కష్టమే మరి.