పోలీసులకు తుపాకులిచ్చింది అందుకేనట!!

Fri Dec 06 2019 22:13:17 GMT+0530 (IST)

BJP Meenakshi Lekhi Reacts To Hyderabad Encounter

దిశ అత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై సాధారణ ప్రజల నుంచే కాదు చట్టసభల ప్రతినిధుల నుంచీ మద్దతు లభించింది. ఉదయాన్నే జరిగిన ఈ ఘటన అనంతరం పార్లమెంటులోనూ వివిధ పార్టీలకు చెందిన ఈ ఎంపీలు దీనిపై గళం విప్పారు. ఒకరిద్దరు మినహా అత్యధికులు ఈ ఘటనను సమర్థించారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తెలంగాణ పోలీసుల చర్యకు మద్దతు పలుకుతూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పోలీసులకు తుపాకులు ఇచ్చింది షో చేయడానికి కాదని ఇలా అప్పుడప్పుడు వాడడానికేనని ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని ఆమె సపోర్టు చేశారు.తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ తాను ఎన్ కౌంటర్లకు వ్యతిరేకమైనప్పటికీ ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం అవసరమని మాత్రం చెప్పగలనన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం దొరికితే ప్రజలు ఎన్ కౌంటర్లు చేయమని డిమాండ్ చేయరని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ తెలంగాణ పోలీసులు చర్యను సమర్ధించారు. ఇలాంటీ సంఘటనల్లో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని కోనియాడారు. ఇలాంటీ సమయంలో పోలీసుకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నావో ఉదంతంపై కేంద్రంపై నిప్పులు చెరిగారు.

కొద్దిగా ఆలస్యం జరిగినా సరైన చర్యే జరిగింది అని ఎంపీ జయాబచ్చన్ వ్యాఖ్యానించారు. మరో ఎంపీ మేనకా గాంధీ మాత్రం ఎన్ కౌంటర్ ను తప్పు పట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని.. నిందితులకు కోర్టు ద్వారా మరణశిక్ష పడేలా చేయాల్సింది.. న్యాయ ప్రక్రియకు ముందే మీరు వారిని కాల్చి చంపాలనుకుంటే - ఇక కోర్టులు - చట్టాలతో పనేముందని ఆమె ప్రశ్నించారు.