Begin typing your search above and press return to search.

అంబానీ, అదానీని పూజించండి.. బీజేపీ ఎంపీ పిలుపు

By:  Tupaki Desk   |   11 Feb 2022 5:30 PM GMT
అంబానీ, అదానీని పూజించండి.. బీజేపీ ఎంపీ పిలుపు
X
ముఖేష్‌ అంబానీ, గౌత‌మ్‌ అదానీ... భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు. వీరి వ్యాపారాలు, వాటి కోసం వీరు తీసుకుంటున్న నిర్ణ‌యాలు కావ‌చ్చు లేదా రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశాలు అయి ఉండ‌చ్చు... కార‌ణాలు ఏవైనా ఈ ఇద్ద‌రు వ్యాపార దిగ్గ‌జాలు వార్త‌ల్లో నిల‌వ‌ని రోజు అంటూ ఉండ‌దు అనేదాంట్లో ఆశ్చ‌ర్యం ఏం లేదు. అయితే, తాజాగా ఈ ఇద్ద‌రు నేత‌ల గురించి పార్ల‌మెంటులో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. ఈ చ‌ర్చ స‌మ‌యంలో బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ చేసిన కామెంట్లు వార్త్ల‌లోకి ఎక్కాయి. ఈ ఇద్ద‌రు వ్యాప‌ర‌వేత్త‌ల‌ను పూజించాల‌ని బీజేపీ ఎంపీ పార్ల‌మెంటు వేదిక‌గా పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

దేశంలోని నిరుద్యోగం గురించి రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపార‌దిగ్గ‌జాలైన‌ అంబానీ, అదానీకి పూజ చేయాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో వారిద్ద‌రూ ఉద్యోగాల‌ను సృష్టిస్తున్నార‌ని, అందుకే వారికి పూజ‌లు చేయాల‌ని తాను చెప్తున్న‌ట్లు ఆల్ఫోస్ త‌న కామెంట్ల‌కు క్లారిటీ ఇచ్చారు. 'నిరుద్యోగం గురించి చ‌ర్చ సంద‌ర్భంగా నేను పెట్టుబ‌డిదారుల పక్షాన్ని తీసుకుంటాన‌ని మీరు విమ‌ర్శ‌లు చేయ‌వచ్చు. వారు ఈ దేశంలో ఉపాధిని సృష్టిస్తున్నారు. ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. వారి పేర్లను కూడా నేను ప్ర‌స్తావిస్తాను. ఎందుకంటే ఇత‌ర పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌స్తావించారు కాబ‌ట్టి. రిల‌య‌న్స్ కానీ, అంబానీ కానీ, అదానీ గానీ.. మ‌రెవ్వ‌రైనా కానీయండి.. వారంద‌రినీ పూజించాలి. ఎందుకంటే.. ఉపాధిని క‌ల్పిస్తున్నారు. అందుకే వారిని క‌చ్చితంగా పూజించాల్సిందే' అంటూ బీజేపీ ఎంపీ కే.జె. ఆల్ఫోస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

స‌హ‌జంగానే ఈ కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అంబానీ, అదానీల‌ను పూజించాల‌ని బీజేపీ ఎంపీ ఆల్ఫోస్ చేసిన కామెంట్లు బీజేపీ విధానానికి నిద‌ర్శ‌న‌మ‌ని కాంగ్రెస్ సెటైర్లు వేసింది. దేశంలోని ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే ఈ ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌ల లాభం కోసమే కేంద్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఆ పార్టీ విరుచుకుప‌డింది. ఇప్పుడు వారిని పూజించాలని పార్ల‌మెంటు వేదిక‌గా పిలుపునిచ్చే స్థాయికి బీజేపీ చేరుకుంద‌ని విరుచుకుప‌డింది. పెట్టుబ‌డిదారుల‌ను పూజించ‌డంలో బీజేపీ బిజీగా ఉంద‌న్న విష‌యం మ‌రోమారు రుజువు అయింద‌ని వామ‌ప‌క్ష పార్టీలు మండిప‌డ్డాయి.