కొత్త సచివాలయ డిజైన్ - బీజేపీ సంచలన ఆరోపణ

Tue Jul 07 2020 23:03:17 GMT+0530 (IST)

New Secretariat Design - BJP sensational allegation

తెలంగాణలో పరిస్థితులు ఎలా అయినా ఉండనీ కేసీఆర్ తాను అనుకున్న పనులు మాత్రం చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. కోర్టులు అనేక తీర్పులు ఇస్తున్నా కోవిడ్ తీర్పులను లెక్కపెట్టని కేసీఆర్... సచివాలయం కూల్చుకోవచ్చని చెప్పిన తక్షణం అర్ధరాత్రి నుంచే పనులు ప్రారంభం చేయించారు. వాయిదా వేసే అవకాశం ఉన్నా కూడా తర్వాత ఎటువంటి ఆటంకాలు వస్తాయో అని సడెన్ గా పాత సచివాలయం కూల్చివేతలు మొదలుపెట్టింది కేసీఆర్ సర్కారు.అయితే ఇంతకాలం దీని మీదున్న వివాదం ఒక లెక్క... కొత్తగా వచ్చిన విమర్శ మరో లెక్క. తెలంగాణలో కొత్తగా కట్టబోయే కొత్త సచివాలయం డిజైన్ మీద కేసీఆర్ పై ఉలిక్కిపడే ఒక విమర్శ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన కొత్త సచివాలయం నమూనా మసీదును నిర్మాణ శైలిని పోలి ఉందంటూ బీజేపీ ఏకైక తెలంగాణ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.

దీనిపై ఆయన తన ట్విట్టరు పేజిలో విమర్శలు సంధించారు. తెలంగాణ సచివాలయం కొత్త డిజైన్ ఫొటో గుమ్మటాలు డిజైన్ యుపిలోని హజ్ హౌస్ లా ఉన్నాయని... జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఎనిమిది నిజాంలా ప్రవర్తిస్తూ మసీదు నిర్మాణ శైలిలో తెలంగాణ కొత్త సచివాలయాన్ని కడుతున్నారని ఆరోపణలు చేశారు. రెండు ఫొటోలను పోలుస్తూ రూపొందించిన ఒక ఇమేజ్ ను ఆయన పోస్ట్ చేశారు.

దీనిని బీజేపీ ఒక అస్త్రంలా మార్చుకునే అవకాశం ఉంది. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే అయినా ఆయన వంద శాతం హిందుత్వ వాదిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి. ఎంఐఎం ఎలా అయితే పాతబస్తీలో తిష్టవేసిందో అదే ఫార్ములాతో అదే పాతబస్తీలో తిష్టవేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పిలువబడే రాజాసింగ్ మొత్తానికి కేసీఆర్ కు ఈ ఆరోపణతో పంటికింద రాయిలా మారారు.