Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. పెట్టేదెవరు?

By:  Tupaki Desk   |   15 July 2020 1:40 PM GMT
కేసీఆర్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. పెట్టేదెవరు?
X
బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత‌, ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్లు ఎంత ఘాటుగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఉస్మానియా ఆస్ప‌త్రిలోకి నీళ్లు వ‌చ్చిచేరాయి. ఈ సంద‌ర్భంపై ఎమ్మెల్యే రాజా‌సింగ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రి ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌డంలేద‌ని, చిన్నపాటి వ‌ర్షానికే వ‌ర‌ద‌లా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి గురించి ఎవరికి చెప్పాలో ఏమి చెప్పాలో అర్థం కావడం లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.

తాను ఉస్మానియా ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన సంద‌ర్భంలో డాక్ట‌ర్లు హెల్మెట్లు పెట్టుకొని ట్రీట్ మెంట్ చేయ‌డాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన‌ట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. ఆస్ప‌త్రిలో రోగులు, డాక్ట‌ర్లు ఇబ్బందిప‌డుతుంటే కేసీఆర్ చూసేందుకు రాక‌పోవ‌డం ఏంట‌ని రాజాసింగ్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ నిర్ల‌క్ష్యం వీడి ఉస్మానియా ఆస్ప‌త్రికి ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చాల‌ని, రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల కోసం ఉస్మానియా ఆస్ప‌త్రిలో రోగుల‌కు స‌రైన స‌దుపాయాలు కల్పించాల‌ని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కూలిపోతే ప్ర‌జ‌లు కేసీఆర్ పై మ‌ర్డ‌ర్ కేసు పెడ‌తార‌ని ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ కు ప్ర‌జ‌ల ప్రాణాల గురించి క‌నీస ఆలోచ‌న‌లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రితో స‌హా రాష్ట్రంలో ఉన్న మంత్రులు రబ్బర్ స్టాంప్ లే..వాళ్ళ వల్ల ఏమి కాద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇదిలాఉండ‌గా హైద‌రాబాద్‌లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, జేఎన్ ‌టీయూ, ప్రగతినగర్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఈసీఐఎల్‌, చిక్కడపల్లి, బాలానగర్‌లో భారీ వర్షం పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.